కేటీఆర్, హరీశ్ మానసికస్థితి బాలేదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్(ట్రిపుల్​ఆర్) నార్త్ పార్ట్ టెండర్ విలువే రూ.7 వేల కోట్లు అయితే రూ.12 వేల కోట్ల అవినీతి ఎలా జరగుతుందని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ప్రజలపై భారం పడుతుందని, అవినీతి అని కేటీఆర్ మతితప్పి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా హరీశ్ రావు, కేటీఆర్ మారడం లేదన్నారు. గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, హరీశ్​మానసిక పరిస్థితి బాలేదని, పార్టీకి భవిష్యత్ లేకపోవటం, మరో 20 ఏండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న అంచనాలతో బావ బామ్మర్దులు ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

ఓడిపోతే ఫామ్ హౌజ్ లో రెస్ట్ తీసుకుంటా అని కేసీఆర్ అన్నారని, అదే మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఆయన అసెంబ్లీకి రాకున్నా నష్టం ఏం లేదన్నారు. కేంద్రం 2017 లో ట్రిపుల్ ఆర్ శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు పనులు ఎందుకు స్టార్ట్ కాలేదో బావ బామ్మర్దులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతేడాది నుంచి సీఎం రేవంత్ రెడ్డి, నేను కేంద్రంతో, నితిన్ గడ్కరీని ఎన్నో సార్లు కలిస్తే ప్రాజెక్టు స్పీడప్ అయిందని, ఇపుడు టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ ఫామ్​హౌస్ లో పూజలు, యాగాల బాధ్యతలు చూసి, రోడ్లను, ట్రిపుల్ ఆర్ ను పట్టించుకోలేదని తెలిపారు. శ్రీశైలం రోడ్ లో 62 కిలోమీటర్ల ఫ్లైఓవర్ దేశంలో ఎక్కడా లేదని ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ రెడీ అవుతుందని, విజయవాడ హైవే 6 లైన్లకు విస్తరిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.