డిసెంబర్ 29న మల్లన్న లగ్గం

  •     30 వేల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ప్రత్యేక ఏర్పాట్లు 
  •     జనవరి 19 నుంచి మూడు నెలల పాటు మహా జాతర

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 10-.45 గంటలకు తోటబావి వద్ద మల్లికార్జునస్వామి, బలిజ మేడల దేవి, గొల్లకేతమ్మల కల్యాణం నిర్వహించనున్నారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణం జరపనున్నారు. వరుడు మల్లికార్జునస్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు, వధువులు బలిజ మేడలదేవి, గొల్లకేతమ్మ తరఫున మహాదేవుని వంశస్తులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. 

స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా 29, 30 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 29న ఆదివారం ఉదయం ఐదు గంటలకు దృష్టి కుంభం, 10.45 గంటలకు కల్యా ణోత్సవం, రాత్రి 7 గంటలకు రథోత్సవం (బండ్లు తిరుగుట) నిర్వహిస్తారు. 30న సోమవారం ఉదయం 9 గంటలకు ఏకాదశ రుధ్రాభిషేకరం, లక్షబిల్వార్చన,  మహా గళహారతి, మంత్ర పుష్ప కార్యక్రమాలను జరుగుతాయి. మల్లన్న కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు, పుస్తెమెట్టెలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అందజేయనున్నారు.

ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటు

మల్లన్న కల్యాణోత్సవానికి సుమారు 30 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. తోటబావి వద్ద జరిగే కల్యణోత్సవాన్ని తిలకించేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలతో పాటు ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీ స్క్రీన్లను సైతం సిద్ధం చేస్తున్నారు. కల్యాణ వేదికపైన మంత్రులు, ఎమ్మెల్యేలకు, వేదిక పక్కన వీవీఐపీలకు, ముందుభాగంలో వీఐపీలు, డోనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సామాన్య భక్తులు కూర్చునేలా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 

కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా రాజగోపురం నుంచి హనుమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలయం వరకు క్యూలైన్లపై చలువ పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. కల్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు.

300 మంది పోలీసులతో భద్రత

కొమురవెళ్లి మల్లికార్జున స్వామి కల్యాణం సందర్భంగా ఆలయ పరిసరాలను నాలుగు సెక్టార్లుగా విభజించి, 300 మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 80 సీసీ కెమెరాలను సిద్ధం చేస్తున్నారు. కల్యాణోత్సవానికి వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రత్యేకంగా స్థలాలను కేటాయించారు. వీఐపీల వాహనాలు తోటబావి ఎడమ వైపు, చేర్యాల, కిష్టంపేట నుంచి వచ్చే వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో, కొండ పోచమ్మ దేవాలయం వైపు నుంచి వచ్చే వాహనాలను పద్మశాలి నిత్యాన్నదానసత్రం ఎదురుగా ఉన్న స్థలంలో పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా చర్యలు చేపట్టారు.

మూడు నెలల మహాజాతర

కల్యాణోత్సవాలు ముగిసిన తర్వాత జనవరి రెండో వారం నుంచి మూడు నెలల పాటు మహాజాతర జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నెలల్లో పది వారాల పాటు జరిగే మహా జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. మహాజాతరలో భాగంగా 29న కల్యాణం, జనవరి 19న పట్నం వారం, 26న లష్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారం, ఫిబ్రవరి 26న పెద్దపట్నం (శివరాత్రి), మార్చి 23న అగ్నిగుండాలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.