అక్కడ స్టాఫ్ అంతా హెచ్ఐవీ రోగులే

అక్కడ స్టాఫ్ అంతా హెచ్ఐవీ రోగులే

కోల్​కతా: హెచ్ఐవీ పాజిటివ్, ఎయిడ్స్ అనే మాట వింటేనే జనాలు భయపడుతుంటారు. ఆ వ్యాధి గురించి ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా.. చాలా మంది హెచ్ఐవీ రోగుల దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడరు. మరి ఆ బాధితులే కేఫ్ స్టాఫ్ అయితే? ఫుడ్ తయారీ నుంచి సర్వింగ్ వరకు వాళ్లే చేస్తుంటే? ఎవరైనా అక్కడకు వెళ్తారా? వాళ్లు తయారు చేసిన ఫుడ్ తింటారా? ఇలాంటి డౌట్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కోల్ కతాలో ఒక కేఫ్ విజయవంతంగా నడుస్తున్నది. హెచ్ఐవీ సోకిన ఏడుగురితో డాక్టర్ కల్లోల్ ఘోష్ ఈ కేఫ్ నిర్వహిస్తున్నాడు. హెచ్ఐవీ బాధిత పిల్లల కోసం ఒక ఎన్ జీఓ నిర్వహించే డాక్టర్ ఘోష్.. 2018లో జోధ్​పూర్ పార్క్ దగ్గర్లోని చిన్న గ్యారేజ్​లో 'పాజిటివ్ కేఫ్' ప్రారంభించాడు. సాండ్ విచ్, ఫిష్, చిప్స్, కాఫీ, ఇతర ఫుడ్ ఐటెమ్స్​ను హెచ్ఐవీ బాధితులే తయారుచేసి సర్వ్ చేస్తుంటారు. మొదట్లో కస్టమర్లు ఇక్కడకు రావడానికి కాస్త ఇబ్బంది పడేవారు. అయితే తర్వాత ఆదరణ పెరగడంతో బాలీగూంగే ప్రాంతంలో పెద్ద ప్లేస్ కు కేఫ్ ను మార్చాడు. ఇలాంటి కేఫ్ ఆసియాలో మొదటిదని డాక్టర్ తెలిపాడు. 'ఏ తప్పూ చేయకుండానే హెచ్ఐవీ బారిన పడిన యువతకు ధైర్యాన్నిచ్చి, తలెత్తుకొని బతికేలా చేయడానికే ఈ కేఫ్ నిర్వహిస్తున్నాను. బాధితులను తాకడం, మాట్లాడటం ద్వారా ఈ వ్యాధి సోకదని మా కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నాము. రాబోయే రోజుల్లో మరిన్ని కేఫ్​లు స్టార్ట్ చేస్తాం' అని డాక్టర్ ఘోష్ చెప్పాడు.