ఆంధ్రప్రదేశ్ లో సంచలన సృష్టించిన కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరగనున్న క్రమంలో ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ వార్ హీటెక్కింది. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న కోడి కత్తి శ్రీను.. జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరాడు. 2024, మార్చి 11వ తేదీ సోమవారం అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో ఆ పార్టీలో చేరాడు.
ఈ సందర్భంగా శ్రీనుకు కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించారు జడ శ్రావణ్. కాగా, ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో శ్రీను ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అప్రువర్‌గా మారిన దస్తగిరి ఇదే పార్టీలో చేరారు. ఆయన పులివెందుల నుంచి సీఎం జగన్ పై పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారు.
2018 అక్టోబర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న అతనికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో.. ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యాడు.