గుడివాడలో తనకు బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా ఉండి గుడివాడ అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. గుడివాడ గడ్డ టీడీపీ అడ్డా అని చెప్పుకునే నేతలు, టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. గుడివాడలో దశాబ్దాల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
వేలాది కోట్లతో గుడివాడను అభివృద్ధి చేస్తున్న తమను సైకో జగన్, రౌడీ నాని, కబ్జాకోరు, దోపిడీదారుడు అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గుడివాడలో ఏమైనా ఇసుక రీచ్‌లు, గ్రానైట్ క్వారీలు ఉన్నాయా దోపిడీ చేయడానికి అంటూ ఎద్దేవా చేశారు. ఎక్కడెక్కడో డబ్బు తెచ్చి గుడివాడ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నానన్నారు కొడాలి నాని. సామాన్య ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే సీఎం జగన్ ప్రభుత్వ ప్రాధాన్యత అంటూ ఆయన తెలిపారు. 2వందల కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులతో గుడివాడలో త్రాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు.