ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమి ఖాయం అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పీకే కి కౌంటర్ గా మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఒక పీకేతో కావడం లేదని చంద్రబాబు మరో పీకేను తెచ్చుకున్నాడని పేర్ని నాని కామెంట్ చేశాడు.తాజాగా కొడాలి నాని పీకేపై తనదైన స్టైల్ లో సెటైర్లు వేసాడు. చంద్రబాబు ప్యాకేజ్ ఇచ్చాడు కాబట్టే పీకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని, పీకే వ్యాఖల వల్ల వోటింగ్ లో రెండు, మూడు శాతం మార్పు వస్తుందన్న భ్రమలో చంద్రబాబు ఉన్నాడని అన్నారు.
ఐప్యాక్ నుండి పీకేను తన్ని తరిమేశారని, ఋషి ఆధ్వర్యంలో ఐప్యాక్ వైసీపీ కోసం పని చేస్తుందని అన్నారు. రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని గెలిపివ్వటమే పీకే పని అన్నారు. ప్రస్తుతం ఏ ఒక్క పార్టీ కూడా పీకేను వ్యూహకర్తగా నియమించుకోలేదని అందుకే చంద్రబాబు లాంటి వారి దగ్గర డబ్బులు తీసుకొని జోస్యం చెబుతున్నాడని అన్నారు. సొంత రాష్ట్రమైన బీహార్లో పీకే పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని అన్నాడు.
ప్రశాంత్ కిషోర్ మరో లగడపాటి రాజగోపాల్ లా తయారయ్యాడని, గతంలో పీకే చెప్పిన జోష్యాలేవీ ఫలించలేదని అన్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 151 కంటే ఎక్కువ స్థానాల్లో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. పీకే ఒక తీసేసిన తహసీల్దార్ అని, ఏ పార్టీకి పని చేయటంలేదని, కేవలం జాతకాలు చెప్పుకొని బతుకుతున్నాడని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు.