మీకు తెలుసా : తెలంగాణలో కంచి ఆలయాన్ని పోలిన ఆలయం ఉంది.. హైదరాబాద్ సిటీకి దగ్గరలోనే..!

 హైదరాబాద్​ మహా నగరానికి కూత వేటు దూరంలో..  శతాబ్దాల చరిత్ర గల ఆలయం భక్తుల నిత్య పూజలతో అవ్యక్త అనుభూతిని కలిగిస్తోంది.. తమిళనాడు రాష్ట్రంలోని  కంచిలో ఉన్నటువంటి ఆలయాన్ని పోలిన దేవాలయం కొడకంచిలో ఉంది.   కంచిలో ఉన్నట్టే బంగారు, వెండి బల్లులు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆదినారాయణ మూర్తి కొలువు దీరాడు.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరి ధిలోని జిన్నారం మండలంలో నిత్యం భక్తుల పూజలతో కంచి తరహాలో విరాజిల్లుతున్న ఓ ఆలయం మన తెలంగాణలో దర్శనమిస్తుంది. కంచికి వెళ్లకున్నా.. కొడ కంచికి వెళ్లాలనేది నానుడి. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ దేవాలయానికి తొమ్మిది శతాబ్దాల చరిత్ర ఉంది. ఇంత చరిత్ర కలిగిన ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

తెలంగాణ కంచిగా పేరుగాంచిన ఈ దేవాలయం జిన్నారం మండలంలో కొలువుదీరిం ది. జిన్నారానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో ఆదినారాయణమూర్తి శ్రీదేవి..  భూదేవి సమేతుడై కొలువుదీరాడు.   పురాతనకాలంలో  నిర్మితమైన ఈ దేవాలయం బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియక పోయినా  తెలంగాణలో బాగా ప్రా చుర్యం గల దేవాలయం.   కంచి మహా క్షేత్రానికున్న ప్రాధాన్యతే ఈ కొడకంచి దేవాలయానికి ఉంది.  దేశవిదేశాల భక్తులు సైతం కొడకంచి దేవాలయాన్ని సందర్శిస్తారు. 

స్థలపురాణం..

భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ కొడకంచి ఆలయానికి పురాతన ప్రాశస్త్యం ఉన్నా ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందుతోంది. భక్తుల కోరికలు తీర్చుతూ.. వారికి సుఖసంతోషాలను ప్రసాదిస్తున్న ఆ ఆదినారాయణుడి ప్రసన్నతే దానికి కారణం. విష్ణు సహస్ర నామంలో భీష్మా చార్యులు తెలిపిన ప్రకారం...  ధర్మాన్ని అనుసరించి జీవులను ఉద్దరించడానికి మహా విష్ణువు ఎత్తిన అవతారమే ఆదినారాయణ స్వామి రూపం. ఆనాడు ఈ ప్రాంతంలో పరిపా లించిన అల్లాని రాజ వంశస్తులకు ఆదినారా యణ స్వామి కుల దైవం. అల్లాని రామోజీరావు అనే రాజుకు ఆదినారాయణ స్వామి కలలో కనిపించి పక్కనే ఉన్న అడవిలో తన విగ్రహంఉందని తీసుకొచ్చి ప్రతిష్టించి పూజలు చేయాలని ఆదేశించినట్లు స్థల పురాణం.  

Also Read :- తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించిన సీఎం రేవంత్

 స్వామి ఆదేశానుసారం అడవిలో వెతుకగా ఒక పుట్టలో స్వామి విగ్రహం లభించగా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారని ఆ వంశస్థుల ద్వారా తెలు స్తోంది. ఆనాటి అల్లాని వంశస్థులు ఒక్కొక్కరిగా ఆదినారాయణ స్వామికి గుడి కట్టడం మొదలు పెట్టి మూడోతరం వరకు కొడకంచి దేవాలయా న్నిపూర్తిచేశారు.

ఒక్క రాయితో...

కంచి ఆలయాన్ని పోలిన ఆలయం లాగానే ఈ ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని ఏకశిలా నిర్మాణం చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత నారాయణ మూర్తి విగ్రహాలకు ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు జరిపించి ప్రతిష్టించారు. అలాగే కంచిలో ఉన్నట్టే వెండి, బంగారు బల్లులను గర్భగు డి పై భాగంలో ప్రతిష్టించి వాటికి కూడా పూజలు జరుపుతున్నారు. నాలుగు స్తంభాల రాజగోపురం గత వైభవానికి, ప్రాభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

 ఆలయ ప్రాంగణం కళ శోభాయమానంగా, అపురూప శిల్ప కళ సమన్వితంగా విరాజిల్లుతుంది. విశాలమైన ముఖ మంటపం ఈ దేవాలయంలో ప్రత్యేక ఆకర్షణ ఏకశిల మూర్తిగా నిర్మించబడిన గర్భగుడి పక్కనే లక్ష్మీదేవి ఆలయం... మరో పక్క గోదా దేవి ఆలయాలు ఉన్నాయి. గర్భ గుడికి ఎదురుగా నల్లరాతితో నిర్మించిన ద్వాదశాల్వాల సన్నిధిని ఏర్పాటు చేశారు. దేవాలయం లోపల ఉన్న మేడి వృక్షం కింద శివాలయాన్ని నిర్మించారు. కోనేరు, ప్రాకార మండపం, మరో పక్క యజ్ఞాది పూజల కోసం నిర్మించిన ప్రత్యేక నిర్మాణాలు ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాయి.

పూజలు..

వైష్ణవ ఆలయంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ కొడకంచి దేవాలయంలో బంగారు, వెండి బల్లులను స్పర్శిస్తే దోషాలన్ని పోయి  మంచి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కంచి దేవాలయంలో ఎలాగైతే దోష నివారణ పూజలు చేస్తారో కొడకంచిలో కూడా అలాగే పూజలు చేస్తుంటారు...ప్రతి సంవత్సరం మాఘమాసంలో మాఘశుద్ధ విదియ నుంచి ఏకాదశి వరకు కొడకంచి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను అట్టహా సంగా నిర్వహిస్తారు. వైష్ణవ సంబంధ పర్వదినాలన్నీ ఈ దేవాలయంలో జరుపు తారు. బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు హాజరై దోషనివారణ పూజల్లో పాల్గొంటారు. దేశంలోని అన్ని రా ష్ట్రాల నుంచి తండోప తండాలుగా భక్తులు వచ్చి ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తుండడం అనవాయితీగా మారింది. స్టా నికులు ఏ పని ప్రారంభించినా కొడకంచి దేవాలయంలో పూజలు చేశాకే మొదలు పెట్టడం ఇక్కడ ఆచారం... 

–వెలుగు, లైఫ్​–