ధరణి భూముల అక్రమాల కేసులో తహసీల్దార్, ఆపరేటర్ కు షాక్

  • నిందితుల బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసిన  కోదాడ జూనియర్ సివిల్ కోర్టు 
  •  మరో మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు 

హుజూర్ నగర్,వెలుగు : ధరణిలో భూముల అక్రమ బదలాయింపు, రైతు బంధు కాజేసిన కేసులో తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీశ్ కు సూర్యాపేట జిల్లా కోదాడ జూనియర్ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది. హుజూర్ నగర్ తహశీల్దార్ గా పని చేసిన సమయంలో తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీశ్ ప్రభుత్వ భూములను అక్రమంగా బదలాయించడమే  కాకుండా రైతుబంధు కాజేశారనే కేసులో నిందితులను అరెస్ట్ గత శనివారం హుజూర్ నగర్ కోర్టులో రిమాండ్ చేయగా సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. 

కాగా.. పోలీసులు సోమవారం విచారణ కోసం ఐదు రోజులు కస్టడీకి కోరగా హుజూర్ నగర్ కోర్టు ఒకరోజు పర్మిషన్ ఇచ్చింది. అయితే.. మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని హుజూర్ నగర్ సీఐ చర మందరాజు కోర్టును కోరారు. కాగా.. జడ్జి లీవ్ లో ఉండడంతో కోదాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం జడ్జి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తహసీల్దార్, ఆపరేటర్ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. కేసులో తహసీల్దార్ జయశ్రీ(A1), జగదీశ్(A2)ను మరో 3 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ అబ్దుల్ అన్సారీ తెలిపారు.