హిందీ.. మన జాతీయ భాష. భారత దేశ ప్రజలను ఏకం చేసే, ఏకతాటిపైకి తెచ్చే ఒక మహత్తర మాధ్యమం. దాదాపు 3, 372కు పైగా భాషలను దేశ ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ.. 24 అధికార భాషలను గుర్తించినప్పటికీ.. జాతీయ భాషగా హిందీనే భావిస్తున్నాం, భాషిస్తున్నాం. ఎందుకంటే దేశంలో హిందీ భాషను మాట్లాడే వారు, అర్థం చేసుకునే వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 1949 సెప్టెంబర్ 14న భారత రాజ్యాంగంలోని 343వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. నాటి నుంచి ఏటా సెప్టెంబర్ 14న ‘జాతీయ హిందీ భాషా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈనేపథ్యంలో ప్రత్యేక కథనమిది.
ఇలా మొదలైంది..
మన దేశంలోని కొన్ని రాష్ట్రాలలో హిందీ మాతృభాషగా ఉంది. అలా అని అక్కడ హిందీ ఒక్కటే లేదు. దాంతో పాటు మరికొన్ని ఇతర భాషలు కూడా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిషా, పంజాబ్, బెంగాల్, కాశ్మీర్ రాష్ట్రాల వాళ్లకు ప్రాంతీయ మాతృభాషలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు భాషా సమస్య ఉత్పన్నమైంది. బ్రిటీష్ వాళ్ల పాలనా కాలంలో ఇంగ్లిష్ ను స్కూళ్లలో బోధించారు. దీంతో అన్ని రాష్ట్రాల ప్రజలను ఏకం చేసే భాషగా అప్పట్లో ఇంగ్లిష్ వెలుగొందింది. ఇది స్వాతంత్ర్యం రాకముందటి ముచ్చట. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక.. ప్రభుత్వ కార్యకలాపాలను జాతీయస్థాయిలో నిర్వహించడానికి ఏ భాషను వాడాలి ? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దీనిపై మన దేశ జాతీయ నాయకుల మధ్య జరిగిన చర్చల ఫలితంగా 1949 సెప్టెంబర్ 14న హిందీని అధికార భాషగా నిర్ణయించారు. ఎన్నో మలుపుల మధ్య భారత రాజ్యాంగంలోని 343వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. ఆ కారణంగా నాటి నుంచి ఆంగ్ల భాష అధికార హోదాను కోల్పోయింది. హిందీ భాషకు పట్టం కట్టారు. నాటి నుంచి సెప్టెంబర్ 14న ‘జాతీయ హిందీ భాషా దినోత్సవం’ జరుపుకుంటున్నాం.
ప్రాంతీయ వైరుధ్యాలు.. పరిష్కారం
హిందీతో పాటు ఆంగ్ల భాష కూడా జాతీయ భాషగా ఉండాలని తమిళులు ఉద్యమాలు జరిపారు. తమిళ మాతృభాష గల తమిళనాడు రాష్ట్రంలో 1937లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో మొట్టమొదటి హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఈనేపథ్యంలో హిందీ జాతీయ భాషగా అమల్లోకి వచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ భాషల్లో కార్యకలాపాలను నిర్వహించుకునే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది. హిందీతో పాటు ఆంగ్ల భాషను 15 సంవత్సరాల పాటు అధికార భాషగా ఉపయోగించుకోవచ్చని 1950 జనవరి 26న పార్లమెంటులో తీర్మానించారు. హిందీ, ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో సైతం ప్రభుత్వ కార్యకలాపాలు చేసుకోవచ్చనే తీర్మానం కూడా చేశారు. ఫలితంగా ప్రాంతీయ భాషల ఉనికికి సంబంధించిన వివాదం కొంతమేరకు సద్దుమణిగింది. ఇన్ని చేసినా ఇప్పటికీ ప్రభుత్వ కార్యకలాపాలు అనేక రాష్ట్రాలలో ఆంగ్లభాషలోనూ, మరికొన్ని రాష్ట్రాలలో హిందీలోనూ జరుగుతున్నాయి. ఆంగ్లం, హిందీ భాషల ప్రాధాన్యత ప్రాంతీయ భాషలకు లభించకపోవడం శోచనీయం. దక్షిణ భారతదేశంలోని 4 ప్రాంతీయ భాషా రాష్ట్రాలు మినహాయిస్తే.. దేశంలోని 28 రాష్ట్రాల్లో అంటే తూర్పు, పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలకు ఉపయోగించే భాషల్లో హిందీ పదాలే ఎక్కువగా ఉన్నాయి.
ఆ కృషీవలుడి పుట్టిన రోజునే..
హిందీ జాతీయ భాష కావడం వెనుక ఎంతో మంది హిందీ అభిమానుల కృషి దాగి ఉంది. ఈ జాబితాలో అందరి కంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు వ్యోహార్ రాజేంద్ర సింహా. ఆయన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 1900 సంవత్సరం సెప్టెంబర్ 14న జన్మించారు. ఆయన 50వ పుట్టినరోజు నే హిందీ జాతీయ భాష దినోత్సవం జరుపు కుంటుండటం విశేషం. హిందీ జాతీయ భాషగా రూపు దాల్చడంలో కీలక పాత్రను పోషించిన వారిలో వ్యోహార్ రాజేంద్ర సింహాతో పాటు కాకా కాలేల్కర్, మైథిలీ శరన్ గుప్త్, హజారీ ప్రసాద్ ద్వివేది, సెట్ గోవింద్ దాస్ ఉన్నారు. హిందీని జాతీయ భాషగా గుర్తించాలనే విజ్ఞప్తితో వాళ్ళు దక్షిణాది లోనూ విస్తృతంగా పర్యటించారు. హిందీ జాతీయ భాష అయితే కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించారు. అమెరికాలో జరిగిన విశ్వ ధర్మ సమ్మేళనం లోనూ వ్యోహార్ రాజేంద్ర సింహా పాల్గొని హిందీలో మాట్లాడి అందరి మన్ననలు అందుకున్నారు. 1988 మార్చి 2న వ్యోహార్ రాజేంద్ర సింహా కన్నుమూశారు. హిందీ సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఏటా జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా హిందీ భాష కోసం విశేష కృషి చేసిన వారికి రాజ్ భాష్ కీర్తి పురస్కార్, రాజ్ భాష గౌరవ్ పురస్కారాలను అందించి సత్కరిస్తారు.
ఆ దినోత్సవాలు రెండూ వేరువేరు..
చాలా మంది జాతీయ హిందీ దినోత్సవం, ప్రపంచ హిందీ దినోత్సవం రెండూ ఒకటే అని పొరపడుతుంటారు. జాతీయ హిందీ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 14న నిర్వహిస్తే.. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఏటా జనవరి 10న జరుపుకోవడం ఆనవాయితీ. 1975 జనవరి 10వ తేదీన నాగ్ పూర్ లో నిర్వహించిన మొదటి ప్రపంచ స్థాయి హిందీ సదస్సులో 30 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, మారిషస్ ప్రధాని సర్ రాం గులాంలు ఇందులో పాల్గొన్నారు. తిరిగి 1976లో మారిషస్ లో రెండో ప్రపంచ మహాసభలు జరగగా.. న్యూ ఢిల్లీలో మూడో ప్రపంచ మహాసభ జరిగింది. వీటి జ్ఞాపకార్థం 2006 నుంచి భారత ప్రభుత్వం జనవరి 10 న ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకుంటోంది.
హిందీ గురించి స్పెషల్ విశేషాలు..
- హిందీ.. అనే పదం పర్షియన్ భాషలోని హింద్ (Hind) నుంచి వచ్చింది. హింద్ అంటే సింధు నది ( ఇండస్ నది) ప్రవహించే నేల అని అర్థం.
- 11వ శతాబ్ద కాలంలో టర్కి పాలకులు మన దేశంపై దండయాత్రకు వచ్చినప్పుడు హింద్ అనే పదాన్ని ఉపయోగించినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతుంటారు.
- హిందీ భాష సంస్కృతం నుంచి పుట్టగా.. దీన్ని దేవనాగరిక లిపిలో రాయడం జరుగుతోంది.
- దేవనాగరి లిపిలో రాసే హిందీ భాషలో చాలా మాండలికాలు కనిపిస్తాయి. వీటిలో బ్రజ్, ఖరీ, బోలీ, బుందేలీ, అవధి, బాఘేలి వంటి మాండలికాలు ప్రముఖమైనవి.
- నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఫిజీ, మారిషస్, సురినామ్, కెనడా, అమెరికా, దక్షిణాఫ్రికా, ఉగాండా, ట్రినిడాడ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఇలా అనేక దేశాల్లో హిందీ మాట్లాడే వారు అధిక సంఖ్యలో ఉన్నారు.
- ప్రపంచ వ్యాప్తంగా 180కిపైగా విశ్వ విద్యాలయాల్లో హిందీ భాషకు సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి.
- ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషలను జనాభాపరంగా పరిశీలిస్తే ఇంగ్లిష్, చైనీస్ భాషల తర్వాతి స్థానం హిందీదే.
- ఐటీ నిపుణులు దేవనాగరి లిపిని.. సుమారు లక్షా 75వేలకుపైగా శబ్దాలను ఇంటర్నెట్ లో నిక్షిప్తం చేశారు. సంస్కృత భాష సహకారంతో హిందీలో 8 లక్షల శబ్దాలు కొత్తగా ఆవిష్కరించారు.
- భారతీయ మూలాలు, భారత సంతతి వ్యక్తులు అత్యధికంగా ఫిజి దేశంలో హిందీ అధికారిక భాష. ఫిజీ రాజ్యాంగంలో ఫిజియన్, ఇంగ్లిష్ తోపాటు హిందీని అధికార భాషగా చేర్చారు. ఫిజీ దేశంలో మాట్లాడే హిందీ మాండలికాన్ని ఫిజి బాత్ లేదా ఫిజి హిందీగా పిలుస్తారు.
- టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్ అడ్రస్ లు రూపొందించడానికి ఉపయోగిస్తున్న ఏడు భాషల్లో హిందీ కూడా ఒకటి.
- 1968లో సుమిత్రా నందన్ పంత్ హిందీ సాహిత్యంలో విశేష సేవలకు ‘జ్ఞానపీఠ’ పురస్కారం పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు.
- 1982లో హిందీ సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి మహిళగా నిలిచారు మహాదేవి వర్మ.
