IND Vs NZ: రెండో టెస్టుకు నో ఛాన్స్.. రాహుల్ చివరి టెస్ట్ ఆడేశాడా..

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టెస్ట్ కెరీర్ సందిగ్ధంలో పడింది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో రాహుల్ పేలవ ఫామ్ తో జట్టు ఓటమికి కారణమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ కాగా.. సెకండ్ ఇన్నింగ్స్ లో 12 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లు అందరూ బాధ్యతగా ఆడితే రాహుల్ మాత్రం సీనియర్ బ్యాటర్ అయి ఉండి జట్టును కష్టాల్లో నెట్టాడు. దీంతో ముంబైలో జరగబోయే సెకండ్ టెస్టుకు అతడిపై వేటు ఖాయంగా కనిపిస్తుంది. 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన గిల్ కోలుకున్నాడని.. అతను రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని కన్ఫర్మ్ చేశాడు. దీంతో గిల్ ఎవరి ప్లేస్ లో ఆడతాడని దానిపై డిబేట్ జరుగుతుంది. గిల్ స్థానంలో తొలి టెస్టులో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ బెంగళూరు టెస్టులో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్ లో 150 పరుగులు భారత టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో అతడిని తప్పించే ప్రసక్తే లేదు. మరోవైపు రాహుల్ టెస్ట్ సగటు కేవలం 33.98 మాత్రమే ఉండడం అతనికి మైనస్ గా మారింది.  

ALSO READ | IND Vs NZ: మర్చిపోలేని క్షణాలు: ఒకే రోజు న్యూజిలాండ్ రెండు చారిత్రాత్మక విజయాలు

టీమిండియా సెలక్టర్లు కూడా కుర్రాళ్ళ వైపే మొగ్గు చూపుతున్నారు. సర్ఫరాజ్, జైశ్వాల్, గిల్, పంత్ లాంటి ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. అభిమన్యు ఈశ్వరన్‌, గైక్వాడ్ లాంటి యువ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతూ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ కారణంగానే దశాబ్దకాలంగా భారత జట్టుకు వెన్నుముకల నిలిచిన పుజారా, రహానేలను సెలక్టర్లు తప్పించారు. ఒకవేళ రెండో టెస్టుకు రాహుల్ బెంచ్ కు పరిమితమైతే అతని టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసినట్టే. ఆస్ట్రేలియా పర్యటనకు అతన్ని పరిగణలోకి తీసుకోవడం కష్టంగా కనిపిస్తుంది.