IND vs NZ, 2nd Test: భారత జట్టులో మూడు మార్పులు.. కారణం ఇదే!

పూణే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. భారత జట్టులో కొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న రాహుల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్ లను తుది జట్టు నుంచి తప్పించారు. వీరి స్థానంలో వాషింగ్ టన్ సుందర్, శుభమాన్ గిల్, ఆకాష్ దీప్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నారు. అయితే టీమిండియా చేసిన ఈ మార్పులకు కారణం లేకపోలేదు. 

గిల్ స్థానంలో తొలి టెస్టులో స్థానం దక్కించుకున్న సర్ఫరాజ్.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్ అయ్యాడు. అదే సమయంలో రాహుల్ రెండు ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన కేఎల్.. రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగులు మాత్రమే చేశాడు. అంతే కాదు రాహుల్ టెస్ట్ యావరేజ్ 33 ఉండడం అతనికి మైనస్ గా మారింది. దీంతో గిల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడంతో రాహుల్ పై వేటు తప్పలేదు. 

ఫాస్ట్ బౌలర్ సిరాజ్ తన చివరి 6 టెస్టుల్లో ఒక్క ఆకట్టుకునే స్పెల్ వేయలేదు. ఈ క్రమంలో ఒక్క మ్యాచ్ లోనూ కనీసం మూడు వికెట్లు తీసుకోలేకపోయాడు. దీంతో అతని స్థానంలో ఆకాష్ దీప్ బెటర్ అని జట్టు యాజమాన్యం భావించి ఉంటుంది. ఆకాష్ దీప్ ఆడిన నాలుగుకు టెస్టుల్లో పర్వాలేదనిపించాడు. ఇక బ్యాటింగ్ డెప్త్ కోసం కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టి సుందర్ కు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మ్యాచ్ విషయానికి న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుంది.