వేలంలో జాక్ పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్.. కళ్లు చెదిరే ధరకు అమ్ముడు

ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా యువ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జాక్ పాట్ కొట్టాడు. వేలంలో వెంకటేశ్ అయ్యర్ ఊహించని రీతిలో భారీ ధరకు అమ్ముడుపోయాడు. వెంకటేశ్ అయ్యర్‎ను కోల్‎కతా  నైట్ రైడర్స్ ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయ్యర్ కోసం వేలంలో ఆర్సీబీ, లక్నో, కోల్ కతా హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఈ ఆల్ రౌండర్ ను దక్కించుకునేందుకు పోటా పోటీగా ధర పెంచుకుంటూ పోయాయి. 

అయితే.. అంతా భారీ ధర పెట్టలేక ఆక్షన్ నుండి లక్నో, ఆర్సీబీ వెనక్కి తగ్గడంతో చివరకు కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‎ను తిరిగి దక్కించుకుంది. కాగా, వెంకటేశ్ అయ్యర్ గత సీజన్‎లో కేకేఆర్ తరుఫున ఆడిన విషయం తెలిసిందే. లాస్ట్ ఎడిషన్‎లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ జట్టు కూర్పులో భాగంగా కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‎ను రిటైన్ చేసుకోలేదు. దీంతో అయ్యర్ మెగా వేలంలోకి రాగా.. తిరిగి మళ్లీ అదే జట్టు భారీ ధరకు దక్కించుకోవడం గమనార్హం.