మారుమూల ప్రాంతంలో పుట్టి.. ప్రధాని స్థాయికి ఎదిగిన గొప్ప లీడర్ పీవీ: కిషన్ రెడ్డి

హైదరాబాద్: భారత రత్న, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దేశానికి విశేషమైన సేవలు అందించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. పీవీ నరసింహారావు 20 వర్ధంతి (డిసెంబర్ 23) సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‎లోని పీవీ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం పీవీ నర్సింహ రావుకు నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు భారత ప్రధానిగా అనేక రకాల ఆర్థిక సంస్కరణలు చేసిన తెలుగు బిడ్డ మన పీవీ అని గుర్తు చేశారు. మన తెలుగు నేల నుంచి మొట్ట మొదటి ప్రధాని అయిన పీవీ.. ప్రజల కోసం విశేషమైన కృషి చేశారని అన్నారు. మారుమూల గ్రామాల్లోని జన్మించి.. ప్రధాని స్థాయికి ఎదిగిన గొప్ప లీడర్ పీవీ అని కొనియాడారు. 

అనేక భాషలలో మంచి పట్టు ఉన్న రాజకీయ నాయకుడు నర్సింహారావని ప్రశంసించారు. రాజకీయాలు వేరు.. దేశం వేరు అనే భావనతో పీవీ పని చేసేవారని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీవీ చరిత్రను బయటకు తీసుకొచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరుఫున మాజీ ప్రధాని పీపీకి ఘన నివాళులు అర్పిస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు.