ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్​కు చిత్తశుద్ధి లేదు...కిషన్ రెడ్డి

 

  • గాల్లో దీపంలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు

పాలమూరు, వెలుగు: ఫోన్  ట్యాపింగ్  వ్యవహారంలో కాంగ్రెస్  ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ వ్యవహారం తమ వరకు వస్తే తప్పక దర్యాప్తుకు సహకరిస్తామని తెలిపారు. శుక్రవారం పాలమూరు జిల్లా కేంద్రంలో మీడియాతో కిషన్  రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన అవినీతిని దర్యాప్తు పేరుతో కాంగ్రెస్  ప్రభుత్వం కోల్డ్  స్టోరేజీలో పెట్టిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి అమిత్ షాను కలిపిస్తే అన్ని వివరాలు ఇస్తానని సీఎం రేవంత్  రెడ్డి గతంలో చెప్పారని, ఆయన ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్  పాలనలో అవినీతి జరిగిందని చెప్పిన సీఎం.. ప్రస్తుతం ఆ పార్టీ నాయకులను కాంగ్రెస్​లో చేర్చుకోవడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. కాంగ్రెస్  పార్టీ ఆరు గ్యారంటీలు గాల్లో దీపంలా ఉన్నాయని, హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కరువు ముంచుకొస్తున్నదని, అప్పుడే హైదరాబాద్  సహా ఇతర జిల్లాల్లో కరెంట్, నీటి కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజల పరిస్థితి చూస్తే పెనంలోంచి పొయ్యిలో పడినట్టు ఉందని, దొంగలు పోయి గజదొంగలు వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని, మహబూబ్​నగర్, నాగర్  కర్నూల్  సీట్లలో కూడా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి, పద్మజా రెడ్డి, డోకూర్  పవన్  కుమార్  రెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.