డిమాండ్లు నెరవేరకపోతే ఢిల్లీకి ట్రాక్టర్ ర్యాలీ
కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాల హెచ్చరికలు
మాకు వేరే దారిలేదు.. తాడో పేడో తేల్చుకోవాల్సిన టైం వచ్చింది..
రేపు ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరపనున్నట్లు వెల్లడి
ప్రభుత్వ తీరుపై ఆవేదనతో ఢిల్లీ బార్డర్లో రైతు ఆత్మహత్య
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఈనెల 26న ఢిల్లీకి ట్రాక్టర్ ర్యాలీ చేపడుతామని రైతు సంఘాలు హెచ్చరించాయి. ‘‘మేం శాంతియుతంగానే ఉండాలని భావిస్తున్నాం. ప్రభుత్వానికి 2 ఆప్షన్లు ఉన్నాయని చర్చల సందర్భంగా చెప్పాం. ఒకటి.. చట్టాలను రద్దు చేయండి. రెండు.. మమ్మల్ని బలవంతంగా ఇక్కడి(ఢిల్లీ బార్డర్ పాయింట్లు) నుంచి ఖాళీ చేయించండి. తాడో పేడో తేల్చుకోవాల్సిన టైమొచ్చింది. అందుకే రిపబ్లిక్ డేను ఎంచుకున్నాం” అని చెప్పాయి. శనివారం వివిధ రైతు సంఘాలకు చెందిన లీడర్లు మీడియాతో మాట్లాడారు.
కేఎంపీ హైవేపైనా ర్యాలీ
తమ ర్యాలీకి ‘కిసాన్ పరేడ్’ అని పేరు పెట్టామని ఫార్మర్ లీడర్ దర్శన్పాల్ సింగ్ తెలిపారు. రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత తాము పరేడ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ‘‘మాకు వేరే దారి లేదు. డిమాండ్లు పరిష్కారం కాకుంటే.. వేలాది మంది రైతులం ట్రాక్టర్లు, ట్రాలీల్లో ఢిల్లీకి పరేడ్ నిర్వహిస్తాం’’ అని స్పష్టం చేశారు. కిసాన్ పరేడ్ నిర్వహించే దారి, టైమింగ్.. తదితర వివరాలను రైతు సంఘాలు తర్వాత వెల్లడిస్తాయని తెలిపారు. కుండ్లి-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) హైవేపై ఈనెల 6న నిర్వహించాలని తలపెట్టిన ట్రాక్టర్ మార్చ్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. ఇది 26న నిర్వహించే పరేడ్‌కు రిహార్సల్ లాంటిదని చెప్పారు. ‘‘ఈనెల 4న ప్రభుత్వంతో చర్చలు. 5న సుప్రీంకోర్టు విచారణ. 6న కేఎంపీ హైవేపై ట్రాక్టర్ మార్చ్. తర్వాత మరో 15 రోజులు ప్రొటెస్టులు కొనసాగిస్తాం. 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గవర్నర్ ఇంటి బయట ప్రొటెస్టులు చేస్తాం” అని వెల్లడించారు.
ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధం: యోగేంద్ర
50 శాతం రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అంతా అబద్ధమని స్వరాజ్ ఇండియా లీడర్ యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం జరగలేదని తెలిపారు. చివరి సారిగా జరిగిన చర్చల్లో.. కేంద్రం రెండు మైనర్ డిమాండ్లకు అంగీకారం తెలిపిందని, అవి కూడా రాతపూర్వకంగా, లేదా చట్టపరంగా నిర్ధారించలేదని రైతు నేతలు చెప్పారు. ప్రధాన డిమాండ్లు ఇంకా అలానే ఉన్నాయని వెల్లడించారు. ‘‘కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో 23 పంటలను కొంటారా? అని గత చర్చల్లో మేం ప్రభుత్వాన్ని అడిగాం. వాళ్లు ‘నో’ చెప్పారు. మరి దేశ ప్రజలకు ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు?” అని ఫార్మర్ లీడర్ గుర్నాం సింగ్ చొదుని ప్రశ్నించారు. ఇప్పటిదాకా 50 మంది రైతులు అమరులయ్యారని యూనియన్ లీడర్ అశోక్ ధవాలె ఆవేదన వ్యక్తం చేశారు.
ఘాజీపూర్ బార్డర్లో రైతు ఆత్మహత్య
ఢిల్లీ, యూపీలను కనెక్ట్ చేసే ఘాజీపూర్ బార్డర్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాకు చెందిన కాశ్మీర్ సింగ్ (75).. కొత్త అగ్రి చట్టాల విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా కొన్నాళ్లుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం భయంకరమైన చర్యలు తీసుకుంటోందంటూ సూసైడ్ నోట్ రాసి.. టాయిలెట్లో ఉరివేసుకుని చనిపోయారు. ఆయన డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆయన్ను ‘బాపు’ అని పిలిచే వాళ్లమని ఇతర రైతులు చెప్పారు. నిరసనలు జరుగుతున్న చోటే తనను దహనం చేయాలని కాశ్మీర్ సింగ్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారని బీకేయూ లీడర్ రాకేశ్ టికైట్ చెప్పారు.
రేపు చర్చలు
మరోవైపు ఈనెల 4న రైతులు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. సోమవారం జరిగే మీటింగ్ విషయంలో ఆశాజనకంగానే ఉన్నామని, అయితే గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని నమ్మడానికి లేదని రైతు నేత అభిమన్యు కోహర్ చెప్పారు. తమ సమస్యలు మీటింగ్‌లో పరిష్కారం కాకపోతే గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని యూనియన్లు శుక్రవారమే ప్రకటించాయి.
for more News..
కరోనా లాక్‌డౌన్ టైమ్ కుటుంబాలకు మేలే చేసింది
హైదరాబాద్‌లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్
ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్
