పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో రిలీజ్ రోజు.. హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో కోమాలోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్న.. చిన్నారి శ్రీతేజ్ కోలుకుంటున్నట్లు ప్రకటించారు కిమ్స్ డాక్టర్లు. 2024, డిసెంబర్ 21వ తేదీ సాయంత్రానికి ఆరోగ్యం మెరుగుపడిందని.. నిలకడగా ఉందని వివరించారు వైద్యులు. వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకుంటున్నాడని హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. కాకపోతే అప్పుడప్పుడు జ్వరం వస్తుందని.. త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు డాక్టర్లు.
శ్రీతేజ్ ఆరోగ్యం నిన్నటితో (శుక్రవారం, డిసెంబర్ 20, 2024) పోల్చితే నేడు బాగానే ఉందని శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటినల్ లో వైద్యులు ప్రకటించారు. మొదట్లో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించామని, ఇప్పుడు వెంటిలేటర్ లేకుండా శ్వాస తీసుకుంటున్నాడని తెలిపారు.
డిసెంబర్ 4న రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ (35) చనిపోగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ కు గాయాలైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శ్రీతేజ్ చికిత్స ఖర్చులను మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని ఇప్పటిక మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రకటించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. చనిపోయిన మహిళ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని.. రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించాడు.