ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బహిరంగంగా కన్నీరు పెట్టుకున్నాడు. ఉత్తర కొరియాలోని అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పరేడ్‌లో పాల్గొన్న ఆయన.. దేశ ప్రజల కష్టాలు, సైనికులకు కృతజ్ఞతలు చెప్పే సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు. దేశ ఆర్ధిక ప్రగతికి అంతర్జాతీయంగా ఆంక్షలు, తుఫానులు, కరోనా మహమ్మారి అవరోధాలుగా మారాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనపై ఉంచిన అపార నమ్మకానికి తగ్గట్టుగా ఏమీ చేయలేకపోయిందుకు సిగ్గు పడుతున్నానని, ఆ విషయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయానంటూ కన్నీరు పెట్టుకున్నాడు. దేశ ప్రజలను కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తన ప్రయత్నాలు, అంకితభావం సరిపోలేదని వెల్లడించారు. అదే సమయంలో దాయాది దేశం దక్షిణ కొరియాతో త్వరలో చేతులు కలుపుతామన్నారు. కరోనా నుంచి దక్షిణ కొరియా త్వరగా కోలుకోవాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆకాక్షించారు.
