బతుకమ్మకుంట ప్రభుత్వానిదే.. హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు

హైదరాబాద్ అంబర్ పేట్‎లోని బతుకమ్మ కుంటపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బతుకమ్మకుంట ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. బ‌తుక‌మ్మ కుంట స్థలం త‌మ‌దని.. ఈ స్థలంలో హైడ్రా చర్యలపై స్టే విధించాలని ఎడ్ల సుధాక‌ర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు 2025, జనవరి 7వ తేదీన తుది తీర్పు వెల్లడించింది. బ‌తుక‌మ్మకుంట స్థలం విషయంలో హైడ్రాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. బ‌తుకమ్మకుంటను ప్రభుత్వ స్థలంగానే గుర్తించిన హైకోర్టు.. బ‌తుక‌మ్మకుంట చెరువు పున‌రుద్ధర‌ణ‌లో హైడ్రా చ‌ర్యలు స‌క్రమ‌మేనని పేర్కొంది. 

ALSO READ | హైదరాబాద్‎లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు

1962 లెక్కల ప్రకారం మొత్తం 14 ఎకరాల 6 గుంటల  విస్తీర్ణంలో బ‌తుక‌మ్మ కుంట‌ విస్తరించి ఉండగా.. కబ్జాల అనంతరం5 ఎకరాల 15 గుంటల భూమి మాత్రమే మిగిలి ఉన్నట్లు తాజా స‌ర్వే ప్రకారం తేలింది. బతుకమ్మకుంటపై కోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం త‌ర‌ఫున సంబంధిత ప‌త్రాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించి.. అనుకూల‌మైన తీర్పు రావ‌డంలో కృషి చేసిన హైడ్రా లీగ‌ల్ బృందంతో పాటు, రెవెన్యూ ఉద్యోగులు కృషి చేశారు. దీంతో ఆయా అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. బతుకమ్మ కుంట విషయంలో హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో త్వరలోనే చెరువు పున‌రుద్ధర‌ణ‌కు హైడ్రా సిద్ధమవుతోంది.