విభజన సమస్యలపై ముందడుగు..రూ.861 కోట్ల లేబర్​సెస్ పంపకానికి ఓకే !

 

  • ఏపీలోని మంగళగిరిలో ఏపీ, తెలంగాణ సీఎస్​ల మీటింగ్​
  • ఎక్సైజ్​ బకాయిలు రూ.81 కోట్లు తెలంగాణకు ఇస్తామన్న ఏపీ
  • విద్యుత్​ బకాయిలపై కుదరని ఏకాభిప్రాయం
  • 9,10 షెడ్యూల్స్​లోని సంస్థల ఆస్తులు,అప్పులపైనా తేలని పంచాయితీ
  • ఉద్యోగుల పరస్పర బదిలీలపైనా చర్చ

హైదరాబాద్​, వెలుగు : విభజన సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేశాయి.  ఏపీలోని మంగళగిరి ఏపీఐఐసీ ఆఫీస్​లో సోమవారం తెలంగాణ సీఎస్​ శాంతికుమారి, ఏపీ సీఎస్ నీరబ్ కుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో  అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.  దాదాపు 2  గంటల పాటు జరిగిన ఈ మీటింగ్​లో 3 అంశాలపై అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. విద్యుత్‌‌‌‌ బకాయిల అంశంపై పంచాయితీ  ఎటూ తేలలేదు. రూ.861 కోట్ల మేర లేబర్ సెస్‌‌‌‌  పంపకానికి అంగీకారం కుదిరింది. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అధికంగా చెల్లించిన రూ .81 కోట్ల బకాయిల అంశం పరిష్కారమైంది. వాటిని తెలంగాణకు తిరిగి చెల్లించేందుకు  ఏపీ ఒప్పుకున్నది.

ఉద్యోగుల పరస్పర మార్పిడి, వృత్తి పన్నులకు సంబంధించి పంపకాలపై ఇరు రాష్ట్రాల ఆయా శాఖల అధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడినట్టు తెలిసింది. 9, 10వ షెడ్యూల్‌‌ సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాల్లో చాలా  అంశాలు ఎటూ తేలలేదు. అంగీకారానికి వచ్చిన రెండు, మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్​ చేయాలని నిర్ణయించారు.

Also Read : టీజీపీఎస్సీలో మహేందర్ రెడ్డి మార్క్

విద్యుత్ బకాయిల పంచాయితీ తేలలే..

ఈ మీటింగ్ లో విద్యుత్ బకాయిల అంశంపై పంచా యితీ ఎటూ తేలలేదు.  తెలంగాణ నుంచి ఏపీ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.7,200 వేల కోట్లు ఉన్నాయని, ఇటీవల రూ.2,500 కోట్లను కేంద్రం విడుదల చేసిందని ఏపీ అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. ఈ క్రమంలో మిగిలిన బకాయిలపై చర్చ జరిగింది. అయితే దీనిపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అదే సమయంలో విభజన పూర్తి కాని 9, 10 వ షెడ్యూల్ సంస్థలకు చెందిన నగదు నిల్వలపైనా ఏ నిర్ణయానికి రాలేదు. లేబర్  సెస్​ను కూడా పంచుకోవాలని 2 రాష్ట్రాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. మొత్తం రూ.861 కోట్ల లేబర్ సెస్‌‌ ఉండగా జనాభా ప్రాతిపదికన  ఏపీ, తెలంగాణ మధ్య విభజనకు నిర్ణయించారు.  ఈ సమావేశంలో డ్రగ్స్​, గంజాయి నిరోధం కోసం ఇరు రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో జాయింట్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన అంశాలపై తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించారు.  

సీఎంల మీటింగ్​కు కొనసాగింపుగా..

 రాష్ట్ర విభజన చట్టంలో  అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ ఏడాది జులై 5న హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్‌‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? అనేదానిపై సీఎంల సమక్షంలో అధికార యంత్రాంగం పలు సూచనలు చేసింది.  ఉన్నతాధికారులు, మంత్రులు, సీఎం స్థాయిలో 3 రకాలుగా సమావేశమై విభజన సమస్యలు పరిష్కారించాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి కొనసాగింపుగా సోమవారం అధికారుల కమిటీ భేటీ అయింది.