ఏదో భూమి బద్దలు అవుతున్నట్లు టీడీపీ ట్వీట్.. తీరా చూస్తే..: పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్స్ (ట్విట్టర్) పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. బిగ్ ఎక్స్‎పోజ్ అంటూ టీడీపీ.. బిగ్ రివీల్ అంటూ వైసీపీ ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా రంజుగా మార్చాయి. మొత్తానికి గురువారం (అక్టోబర్ 24) మధ్యాహ్నం  సరిగ్గా12 గంటలకు రెండు పార్టీలు ఉత్కంఠకు తెరదించాయి. ఓ ప్రముఖ టీవీ చానెల్ అధినేతకు డ్రగ్ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయంటూ వైసీపీ ఆరోపించగా.. ఆస్తి కోసం తల్లి, చెల్లిని జగన్ ఇబ్బంది పెడుతున్నాడని.. ఇలాంటి కొడుకు, అన్న ఎవరికీ ఉండొద్దంటూ టీడీపీ ట్వీట్స్ చేశాయి. ఈ క్రమంలో టీడీపీ ట్వీట్‏పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. 

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏదో భూమి బద్దలు అవుతున్నట్లు టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.. తీరా చూస్తే జగన్ కుటుంబ వ్యవహారంపై మీద  ఎక్స్‎లో పోస్ట్ పెట్టిందని టీడీపీపై మండిపడ్డారు. జగన్ వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగుతూ.. దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ను పతనం చేయాలనే తప్పుడు ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేపట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టదని.. ప్రతిపక్ష నేతల వ్యక్తిగత విషయాల మీద మాత్రం దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ | ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్

షర్మిలకు ఇప్పటికే జగన్ ఆస్తులు ఇచ్చారన్న పేర్ని నాని.. వ్యాపారాల్లో వచ్చే ఆదాయాల్లోనూ వాటాలు ఇచ్చారని చెప్పారు. జగన్ స్వార్జిత ఆస్తులను అఫిడవిట్‌లో చూపించారని అయినప్పటికీ దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌పై దాడులు చేయించారు. ఆస్తులు అటాచ్ చేసి ఐదేళ్లు నరకం చూపారు. 35 ఏళ్ల కుర్రాడిని తట్టుకోలేక.. అప్పటి సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా పిల్లిమొగ్గలు వేశారని విమర్శించారు. అలాంటిది జగన్‎ను ఇప్పుడేమో చేస్తారని ప్రశ్నించారు.