- ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ కూడా.. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన
- రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు.. జాబ్ నోటిఫికేషన్లు అప్పుడే
హైదరాబాద్, వెలుగు : కొత్త ఏడాది మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనున్నది. ముఖ్యమైన, సున్నితమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ప్రధానంగా వచ్చే నెలలోనే కుల గణన సర్వే రిపోర్ట్‌ను ప్రభుత్వం రిలీజ్ చేయనున్నది. దాంతోపాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నది. అలాగే, ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన వన్ మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలోనే రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించనున్నది.
దీని ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేపట్టి.. ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ రిపోర్ట్ వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి. వీటితోపాటు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఇండ్లకు ముగ్గు పోయడం వంటి ముఖ్యమైన నిర్ణయాలన్నీ జనవరి నెలలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
కుల గణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్స్ సిద్ధం!
కుల గణన సర్వేలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఇండ్ల నుంచి దాదాపు 97 శాతం మేర వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఈ డేటా మొత్తం డిజిటలైజేషన్ చేశారు. ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అన్ని వివరాలు కాకుండా.. అవసరమైన వాటిని ప్రభుత్వం బయట పెట్టనున్నది. ఇక బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు కూడా ఎంత వరకు సమాచారం అవసరం పడుతుందో అంతే ఇవ్వనున్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రానున్నది. ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కమిషన్ కూడా జనవరిలోనే రిపోర్ట్ ఇవ్వనున్నది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎస్సీ వర్గీకరణపై రిపోర్ట్ వచ్చాక.. కొత్త రోస్టర్‌తో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనైనా ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.
ఇదే నెలలో మరో మూడు..
గత కొంత కాలంగా నానుతూ వస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటివి కూడా జనవరిలోనే మొదలు కానున్నాయి. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని సంక్రాంతి తర్వాత ఇవ్వనున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుల వడపోత నడుస్తున్నది. అందులో నుంచి అర్హుల్లో మొదటి విడత లబ్ధిదారుల లిస్ట్ ను రిలీజ్ చేయనున్నారు.
ALSO READ : మహిళలపై నేరాలు పెరిగినయ్..నిరుడితో పోలిస్తే 4.78% ఎక్కువ నమోదు
సంక్రాంతి తర్వాత వచ్చే మంచి రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వీటితోపాటు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వచ్చే నెలలోనే మొదలుపెట్టనున్నారు. వీటన్నింటికి సంబంధించి త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది.