కేరళలో 28 ఏళ్ల కిందట జరిగిన సిస్టర్ అభయ హత్య కేసులో క్యాథలిక్ చర్చి ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీ హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో ఇవాళ(బుధవారం)ఆ ఇద్దరు దోషులకు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. 21 ఏళ్ల అభయ కొట్టాయం బీసీఎం కాలేజీ విద్యార్ధిని.. అక్కడే సెయింట్ పియోస్ కాన్వెంట్ హాస్టల్‌లో ఉండేది. మార్చి 27, 1992న కాన్వెంట్‌లోని బావిలో అభయ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని స్థానిక పోలీసులు ఈ కేసును మూసేశారు. కొందరు కోర్టును ఆశ్రయించడంతో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం సెఫీతో.. కొట్టూర్ మార్చి 27, 1992న శారీరకంగా సన్నిహితంగా ఉండటాన్ని అభయ చూసింది. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని నిందితులు అభయను గొడ్డలితో నరికి చంపి, బావిలో పడేశారు. గతేడాది ఆగస్టు 26న విచారణ మొదలవగా ప్రాసిక్యూషన్‌కు పలువురు సాక్షులు ఎదురుతిరిగారు. అయితే, హత్య జరిగిన రోజు కాన్వెంట్‌లో దొంగతనం చేయడానికి వెళ్లిన రాజు అనే ఓ దొంగ అక్కడ కొట్టూర్, సెఫీని చూశానని సాక్ష్యం చెప్పాడు. రాజు ఒక్కడే మాట మార్చకుండా చివరిదాకా నిలబడ్డాడు. అతడు ఇచ్చిన సాక్ష్యంతో చర్చి ఫాదర్ , సిస్టిర్ కు జీవిత ఖైదు విధించింది కోర్టు.
