యాత్రికులు సంఖ్య పెంపుపై సుప్రీంను ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం

యాత్రికులు సంఖ్య పెంపుపై సుప్రీంను ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం
శబరిమలకు యాత్రికుల సంఖ్యను రోజుకి 5వేలకు పెంచాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా వైరస్ కారణంగా యాత్రికుల సంఖ్యను పెంచడంతో పోలీసులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్‌ 20 నుండి జనవరి 14 వరకు శబరిమల ఆలయంలో మకర విళక్కు ఉత్సవాలు  జరుగనున్నాయి. దీంతో కరోనా దృష్ట్యా యాత్రికుల సంఖ్యపై  ప్రభుత్వం పరిమితి విధించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో డిసెంబర్‌ 14న సమావేశమైందని తెలిపింది. ఆరోగ్య సలహాదారు సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకుని రోజుకు 2వేల మంది… వీక్ ఎండ్ లో 3వేల మంది యాత్రికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించిందని కేరళ ప్రభుత్వం ఆ పిటిషన్‌లో తెలిపింది. అయితే ప్రతివాదులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లను కొట్టేయడంతో పాటు.. యాత్రికుల సంఖ్యను రోజుకు 5వేలకు పెంచాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చినట్లు తెలిపింది. శబరిమల ఆలయంలో ఇప్పటికే అధికసంఖ్యలో పోలీస్‌ అధికారులు, ఆరోగ్య అధికారులు కరోనా బారిన పడ్డారని ప్రభుత్వం తరపున లాయర్ జి. ప్రకాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. యాత్రికులకు ఆరోగ్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసులు క్యూ పద్ధతిలో వారిని ఆలయంలోకి అనుమతిస్తున్నారని, యాత్రికుల సంఖ్య పెరిగితే వారిపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, యాత్రికులను నియంత్రించడం కష్టమవుతుందని తెలిపింది. బ్రిటన్‌లో కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌ను గుర్తించారని, దీంతో ప్రభుత్వం ఇప్పటికే విమానాలను రద్దు చేసిందని, ఈ పరిస్థితి దృష్ట్యా ఈ పిటిషన్‌పై కోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది.