రోడ్డుపై గవర్నర్​ ధర్నా..రోడ్డు పక్కన కుర్చీలో కూర్చుని నిరసన

రోడ్డుపై గవర్నర్​ ధర్నా..రోడ్డు పక్కన కుర్చీలో కూర్చుని నిరసన

 కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళలోని వాపపక్ష ప్రభుత్వం మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా, అధికార సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రోడ్డుపై ధర్నాకు దిగారు.

 కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్ అనూహ్యంగా వ్యవహరించారు. తన కారు దిగి, రోడ్డుపక్కన ఒక షాపు ముందు బైఠాయించారు.తనపై నిరసన తెలిపిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఇలా అభ్యంతరం వ్యక్తం చేశారు. కొల్లాం జిల్లాలో ఈ ఘటన జరిగింది.గవర్నర్‌ ఓ కార్యక్రమానికి వెళ్తుండగా, అధికార సీపీఎం అనుబంధ సంస్థ ఎస్‌ఎఫ్‌ఐకు చెందిన కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా నల్లజెండాలు ప్రదర్శించి నిరసన తెలపడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. ఆయన వెంటనే కారు దిగి, దగ్గర్లోని షాపు నుంచి కుర్చీ తీసుకొని రోడ్డుపక్కన వేసుకొని కూర్చున్నారు. ఈ సమయంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేరళలో గవర్నర్‌, సీఎంల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పంపించే బిల్లులను గవర్నర్‌ ఆమోదించకపోవడం, యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈక్రమంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది.‘ఇక్కడ మీరు నిరసనకారులకు రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే.. ఇంక దానిని ఎవరు కాపాడతారు..?’ అని ఉన్నతాధికారులతో మాట్లాడారు. 13 మంది నిరసనకారుల్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పగా.. మిగతావారి సంగతేంటని ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.

రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్

కేరళ లో అధికారంలో ఉన్న సీపీఎం ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య చాన్నాళ్లుగా విబేధాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులపై ఆయన సంతకం చేయకపోవడం వంటి పలు అంశాలపై కేరళ గవర్నర్, వామపక్ష ప్రభుత్వం మధ్య విభేదాలు ఉన్నాయి. శుక్రవారం ( జనవరి 26)  రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించినా వారెవరూ రాలేదు. కేరళ ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కేఆర్ జ్యోతిలాల్ మాత్రం వచ్చారు.