భారత ప్రతిష్టను దిగజారుస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంగా అందరూ గౌరవించే దేశాన్ని ప్రపంచం ముందు సిగ్గు పడే స్థితికి తీసుకొచ్చిందన్నారు. సామాజిక భద్రత, ఆర్థిక సుస్థిరతను ప్రమాదంలో పడేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మతతత్వం, దేశ సామాజిక భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. లక్షలాది మంది భారతీయులకు ఉపాధి కల్పిస్తూ.. ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి కీలకమైన సహకారాలను ఇస్లామిక దేశాలు అందిస్తున్నాయని, ఇప్పుడు వ్యతిరేకంగా గళం విప్పాయని తెలిపారు. మరొక మతం యొక్క విశ్వాసాలు, సంస్కృతిని అవమానించడం, తిరస్కరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్వేష ప్రచారకులను శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల టీవీ చర్చలో భాగంగా ముహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఆరేళ్ల పాటు ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. నూపుర్ శర్మతో పాటు నవీన్‌జిందాల్ ను ప్రాథమిక సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. సస్పెండ్ అనంతరం నూపుర్ శర్మ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు.. "నా మాటలు ఎవరికైనా అసౌకర్యం కలిగించినా లేదా మతపరమైన భావాలను గాయపరిచినా, నేను బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదు." అని అమె తన ట్వీట్ లో రాసుకొచ్చింది.
