కేరళ సీఎంకు విమానంలో నిరసన సెగ

కేరళ సీఎంకు విమానంలో నిరసన సెగ

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు విమాన ప్రయాణంలో ఊహించని సంఘటన ఎదురైంది. యూత్​ కాంగ్రెస్​కు చెందిన ఇద్దరు కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఎల్​డీఎఫ్​ కన్వీనర్​ ఈపీ జయరాజన్​.. ఇద్దరు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు. వారు నినాదాలు చేస్తుండగా జయరాజన్​ వారిని తోసేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన కేరళలోని కన్నూర్​ నుంచి తిరువనంతపురం​ వెళ్లే విమానంలో జరిగింది. 

విమానంలో నిరసనలు చేపట్టిన యూత్​ కాంగ్రెస్ మట్టన్నుర్​ బ్లాక్​ అధ్యక్షుడు ఫర్సిన్​ మజీద్​, కన్నూర్​ జిల్లా సెక్రెటరీ ఆర్​కే నవీన్​ కుమార్​ను.. కన్నూర్​ విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. తాము వైద్యం కోసం తిరువనంతపురం​ వెళ్తున్నామని చెప్పడంతో అనుమతించినట్లు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కార్యకర్తల పట్ల ఈపీ జయరాజన్​ దురుసుగా ప్రవర్తించారని, వారిపై చేయి చేసుకున్నారని యూత్ కాంగ్రెస్ ఆరోపించింది​. కొద్ది రోజుల క్రితం బంగారం స్మగ్లింగ్​ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్​పై నిందితురాలు స్వప్న సురేశ్​ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో విపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి.