మహిళ కడుపులో రూ. 14 కోట్ల కొకైన్.. చెన్నై ఎయిర్​పోర్టులో కెన్యా స్మగ్లర్ అరెస్టు

చెన్నై: సినీ ఫక్కీలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కెన్యా మహిళ కస్టమ్స్ అధికారులకు చిక్కింది. ఆమె ఏకంగా రూ.14.2 కోట్ల విలువైన కొకైన్​ను కడుపులో దాచుకుని తీసుకొచ్చింది. కొకైన్​ను గోలీల (క్యాప్సూల్స్) రూపంలోకి మార్చగా, 90 క్యాప్సూల్స్ ను ఆ మహిళ మింగింది. ఈ కేసు వివరాలను చెన్నై కస్టమ్స్ అధికారులు మంగళవారం వెల్లడించారు. కెన్యాకు చెందిన మహిళ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి ఈ నెల 7న చెన్నై ఎయిర్​పోర్టుకు వచ్చింది.

ఆమె డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నదని కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం అందింది. దీంతో ఆ మహిళ ఫ్లైట్ దిగగానే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర సెర్చ్ చేయగా ఏమీ దొరకలేదు. అయితే ఆ మహిళ కొన్ని క్యాప్సూల్స్ కడుపులో దాచుకుని తెచ్చినట్టు గుర్తించారు. వాటిని పరీక్షించగా అందులో కొకైన్ ఉన్నట్టు తేలింది. ‘‘కెన్యా మహిళ డాక్టర్ల సాయంతో కొకైన్ క్యాప్సూల్స్ ను కడుపులో దాచుకుని తెచ్చింది. మొత్తం 1.4 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ రూ.14.2 కోట్లు ఉంటుంది. నిందితురాలిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. ఆమెను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాం” అని అధికారులు తెలిపారు. 

ముంబైలో ఒకరు అరెస్టు.. 

ముంబైలో కొకైన్ తో తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతణ్ని ఇమ్రాన్ యాకూబ్ షేక్ గా గుర్తించారు. అతని వద్ద 949 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి కొకైన్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరికి సప్లై చేయాలని అనుకున్నాడు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాకూబ్ పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.