కేజ్రీవాల్​ కొత్త స్కీం: ఢిల్లీలో పూజారులు, గ్రంథిలకు నెలకు రూ.18 వేల భృతి

న్యూఢిల్లీ, వెలుగు: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మళ్లీ అధికారంలోకి వస్తే ఆలయాల్లోని పూజారులు, గురుద్వారాలోని గ్రంథిలకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ‘పుజారి గ్రంథి సమ్మాన్ యోజన’ పేరుతో స్కీమ్ అమలు చేస్తామని తెలిపారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా నాల్గోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే ఆలోచనలో ఆప్ ఉన్నది. ఈమేరకు ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మన సమాజంలో ఆలయాల్లోని పుజారులు, గురుద్వారలోని గ్రంథిలకు ఎంతో గౌరవం ఉన్నది.

మన సంస్కృతి, సంప్రదాయాలను వారు కాపాడుతున్నారు. మన ఆచారాలను భవిష్యత్ తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. దేశంలోనే మొట్టమొదటి సారిగా పుజారులు, గ్రంథిలను ఆర్థికంగా ఆదుకునేందుకు స్కీమ్ తీసుకొస్తున్నం. అర్హులైన వారందరికీ రూ.18 వేల గౌరవ వేతనం అందిస్తాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మంగళవారం నుంచే ప్రారంభిస్తున్నాం. అందరూ అప్లై చేసుకోండి’’ అని కేజ్రీవాల్ తెలిపారు. 

అన్ని ఆలయాలు, గురుద్వారాల్లో రిజిస్ట్రేషన్లు..

మంగళవారం కన్నాట్​ప్లేస్‎లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ‘పుజారి గ్రంథి సమ్మాన్ యోజన’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తానని అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని అన్ని గురుద్వారాలు, ఆలయాల్లో ఆప్  కార్యకర్తలు రిజిస్ట్రేషన్లు చేస్తారన్నారు. ఆప్ తీసుకొస్తున్న పథకాలను బీజేపీ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.

 ‘పుజారి గ్రంథి సమ్మాన్ యోజన’ను ఆపేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. ఇలా అడ్డుకోవడం మహా పాపం అని విమర్శించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఎంతమంది అప్లై చేసుకున్నారో వెల్లడిస్తామన్నారు. అయితే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం స్పష్టమైన మార్గదర్శకాలేవీ కేజ్రీవాల్ ప్రకటించలేదు.