మేడిగడ్డ కేసులో నోటీసులు రద్దు చేయండి : హరీశ్ రావు

  • హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌‌ నేడు విచారణ  

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ ప్రాజెక్టు కేసులో జారీ అయిన నోటీసులను రద్దు చేయాలని మాజీ సీఎం, బీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌ కె. చంద్రశేఖర్‌‌రావు, అప్పటి ఇరిగేషన్‌‌ మంత్రి హరీశ్ రావు సోమవారం హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. మేడిగడ్డ కుంగుబాటుకు అక్రమాలు, అవినీతి కారణమనే కేసులో కేసీఆర్, హరీశ్​తోపాటు అధికారులు, కాంట్రాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలని జయశంకర్‌‌ భూపాలపల్లి ఫస్ట్​క్లాజ్ జ్యుడీషియల్‌‌ మేజిస్ట్రేట్‌‌ కోర్టులో సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి పిటిషన్‌‌ వేశారు. 

అయితే, రాజలింగమూర్తి 2023, నవంబర్‌‌ 7న వేసిన పిటిషన్‌‌లోని అంశాలు తమ పరిధిలోకి రావని ఈ ఏడాది జనవరి 12న మేజిస్ట్రేట్‌‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషన్‌‌ను కొట్టేసింది. దీనిపై రామలింమూర్తి భూపాలపల్లి సెషన్స్‌‌ కోర్టులో రివ్యూ పిటిషన్‌‌ వేశారు. రివ్యూ పిటిషన్‌‌పై ప్రిన్సిపల్‌‌ సెషన్స్‌‌ జడ్జి కోర్టు విచారణ జరిపి.. కేసీఆర్, హరీశ్​తో పాటు నాటి స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ రజత్‌‌ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్‌‌ ఇన్‌‌ చీఫ్‌‌ హరిరామ్, చీఫ్‌‌ ఇంజనీర్‌‌ శ్రీధర్, మేఘా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్‌‌అండ్‌‌టీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. 

అయితే, సెషన్స్‌‌ కోర్టు నోటీసులు జారీ చేయడం చట్ట వ్యతిరేకమని కేసీఆర్, హరీశ్​హైకోర్టును ఆశ్రయించారు. ప్రైవేట్‌‌ వ్యక్తి పిటిషన్‌‌(ఫిర్యాదు)పై విచారణ జరిపే అధికార పరిధి సెషన్స్‌‌ జడ్జికి లేదన్నారు. మున్సిఫ్‌‌ మేజిస్ట్రేట్‌‌ పిటిషన్‌‌ను కొట్టేస్తూ గతంలో తీర్పు చెప్పారని గుర్తు చేశారు. ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్‌‌ దాఖలు చేస్తే సెషన్స్‌‌ కోర్టు విచారణ చేపట్టడానికి వీల్లేదన్నారు.  దీనిపై సెషన్స్‌‌ కోర్టు అభ్యంతరాలను తిరస్కరించి పిటిషన్‌‌కు నంబర్‌‌ కేటాయించాలని జులై 10న ఇచ్చిన ఆదేశాలు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. ఆగస్టు 5న ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కూడా కోరారు. కాగా, వారు దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ మంగళవారం విచారణ చేపట్టనున్నారు.