సారు.. మార్చిండు సాగు

  • ఎర్రవల్లి ఫామ్‌‌హౌస్‌‌లో 150 ఎకరాల్లో వెదురు సాగుకు ఏర్పాట్లు

సిద్దిపేట, వెలుగు : ఎర్రవల్లి ఫామ్‌‌హౌస్‌‌లో నిన్నమొన్నటి వరకు మక్కజొన్న, వరి, కూరగాయలు సాగు చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు రూటు మార్చారు. మొత్తం 150 ఎకరాల్లో వెదురు సాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొంత భాగంలో గుంతలు తీసి వెదురు మొక్కలు నాటడం పూర్తి కాగా, మరికొన్ని చోట్ల సాగుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. వెదురు సాగుకు డ్రిప్‌‌తో నీటిని అందించేందుకు కొన్ని ప్రాంతాల్లో పైప్‌‌లైన్లు సైతం వేశారు. ఫామ్‌‌హౌస్‌‌లో కూరగాయలతో పాటు వివిధ రంగుల్లో క్యాప్సికమ్‌‌ పండించిన కేసీఆర్‌‌ మక్కజొన్న, వరి సాగుపై ఆసక్తి చూపేవారు. ఈ వానాకాలం సీజన్‌‌లో మక్కజొన్న, వరి కోతలు పూర్తి కావడంతో వెదురు సాగు చేపట్టారు.

తక్కువ పెట్టుబడి.. దీర్ఘకాలికంగా దిగుబడి

గడ్డి జాతికి చెందిన వెదురు సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉండడం, సొంతంగా పెరిగే స్వభావం ఉండడంతో పాటు ఒక్కసారి నాటితే 50 నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి మూడు నుంచి నాలుగు సంవత్సరాలకోసారి పంట చేతికి వస్తుంది. ఈ కారణం వల్లే వెదురు సాగుకు కేసీఆర్‌‌ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. ఫామ్‌‌హౌస్‌‌ పక్కనే కొండ పోచమ్మ సాగర్‌‌ రిజర్వాయర్‌‌ ఉండడంతో నీటి సౌలభ్యం ఎక్కువగా ఉండడం కూడా ఓ కారణమని పలువురు భావిస్తున్నారు.

 డిమాండ్‌‌కు తగ్గట్లుగా వెదురు సప్లై లేకపోవడం, తక్కువ ధరకు మొక్కలు లభిస్తుండడంతో లాభదాయక పంటగా భావించినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వెదురులో అంతరపంటగా అల్లం, పసుపు, మునగ సాగు చేసే అవకాశం సైతం ఉంటుంది. వెదురు టన్ను రూ. 4 వేలు పలుకుతుండడం, ఎకరాకు నలభై టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. 

తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా దిగుబడి రావడం, ఎరువుల అవసరం లేకపోవడం, మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో పంట చేతికి వచ్చే చాన్స్‌‌ ఉండడం వల్లే వెదురు సాగుకు కేసీఆర్‌‌ మొగ్గు చూపారని స్థానిక రైతులు అనుకుంటున్నారు. గజ్వేల్‌‌ నియోజకవర్గ పరిధిలోని ములుగులో ఉన్న సెంటర్‌‌ ఫర్‌‌ ఎక్సలెన్స్‌‌ వెదురు సాగు చేస్తున్న రైతుల సందేహాలను తీరుస్తోంది. ఈ సెంటర్‌‌ కేసీఆర్‌‌ ఫామ్‌‌హౌస్‌‌ పక్కనే ఉండడం గమనార్హం.