జీవన తాత్పర్యం–ఆ పేరులోనే ఎంతో భావముంది. జీవితానికి కవిత్వం వ్యాఖ్యానమే. అయితే ఇందులోని కవిత్వం జీవితానికి తాత్పర్యం. అన్నవరం దేవేందర్ రాసిన ఈ సంపుటి 22 కవితల కలయిక. దేవేందర్ పొద్దున్నే లేచి బంతిపూలను పలకరిస్తడు. బచ్చలి తీగను అందుకుంటడు. మొక్కలకు నీళ్లు తాపిస్తడు.పిల్లి కూనలకు పాలు పోస్తడు. ముగ్గులను చూసి మురుస్తడు. నేలమీద అటూ ఇటూ నడుస్తడు. నీలాకాశంకేసి చూస్తడు. ప్రకృతిలో ఆకృతై పలవరిస్తడు. అప్పుడప్పుడు అమ్మమ్మ ఊరి మీద వాలి వస్తడు. అమ్మ అంబాడిన నేలను మృదువుగా ముట్టుకుంటడు. “తల్లిగారిల్లు అంటే–మూలకణాలు పొదిగిన పొదరిల్లు". ఊరులోని వాడలు, చేనులు చెల్కలలో చిన్ని చిన్ని పాదాలతో నడచిన బాటల పాదముద్రలను హృదయంతో ఫోటోలు తీసుకుంటడు.
పిల్లను చూసిన్నాడు పోయినట్లుగనే అత్తగారి ఊరూ పోయివస్తడు. ఈ కవికి చెరువునీళ్ల అలలను చూస్తే ఈత కొట్టాలని, క్రీడా మైదానం కనిపిస్తే పరుగు పరుగున నడవాలని, నీలాకాశం వీక్షిస్తే పక్షిలా ఎగరాలని ఉంటది. “ప్రకృతితోనే సమస్త దేహం కరచాలనం”. తేటతెల్ల కాయితాలు కనిపిస్తే మాత్రం అక్షరాలు అల్లుకుంటాయి, కవితా చరణాలు తన్నుకొస్తాయి.ఇందులోని మొదటి కవిత సకల ఆధిపత్యాలకు ధిక్కారం. 'వాల్ పోస్టర్' ఆనాటి కమ్యూనికేషన్ సిస్టం. 'తలపువ్వులు' జీవితాలను త్యాగం చేసిన నిలువెత్తు జాడలు. 'నాగళ్లకు సంకెళ్లు' కర్షకుల కడగండ్లకు దర్పణం. 'జీవన తాత్పర్యం' “ఈ లోకం మీద నన్ను నాటిన అమ్మా నీకు వందనం” అంటూ అమ్మకు నీరాజనం. కేరళ యాత్ర జీవ వైవిధ్యాల సుగంధం. 'అగులు బుగులు'లో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉంటాయి. 'అల్లిక'లో మనిషితో మనిషి తీగ అల్లుకుపోతుంది.
ఈ కవి దృష్టిలో – "సకల జీవులకూ వలస ఒక అనివార్యత | వలస ఒక జాతీయతా సంపర్కం”. “ఆహారమే వ్యవసాయ పరమార్థం. బియ్యం గింజలే జనజీవన ఆహారం. వరినారు మడి సాంస్కృతిక పరంపర”. రైతులు "చరాచర ఆహార సృష్టికర్తలు / వాళ్లు పొలం దున్నీ దున్ని మన్ను నుంచి అన్నం సృష్టిస్తున్నరు / ఆకలి తీర్చడమే వాళ్ల జీవన సంకల్పం”.కలకాలం గుర్తుంచుకోదగిన కవితా పంక్తులు కొన్ని ఈ కవనంలో ఉన్నాయి. “నీపై నీవే సంస్కరణ యుద్ధం చేసుకుంటేనే – మస్తిష్కంలోంచి మాలిన్యపు మబ్బులు కరిగిపోతాయి”. “చెట్టంత కవితో చెలిమి అంటే – సృజన అనుభవాల మేలు కలిమి”. “కవి – గత వర్తమానాల చరిత్ర సారభూతం – భవిష్యత్ కళ్ల ముందు నిలిపే కాలజ్ఞాని”. “కలం కవిత్వమై పారాలంటే – మనసు నిండా కార్య సృజన నిండాలి” – మొదలైనవి.పరిశీలనా దృష్టి, కవితా సృష్టి అన్నవరం దేవేందర్ సొంతం. పదాలు మృదువుగా ఉంటాయి. భావాలు పాఠకులను అల్లుకుపోతాయి.
– ఎ. గజేందర్ రెడ్డి , 9848894086
