చదివింది ఇంటరే అయినా.. రూ. కోటి గెలుచుకుంది

చదివింది ఇంటరే అయినా.. రూ. కోటి గెలుచుకుంది

‘కౌన్‌బనేగా కరోడ్ పతి-14’ ఇటీవల పాల్గొన్న ఓ సాధారణ గృహిణి కోటి రూపాయలు గెలుచుకున్నారు. అంతే కాదు ఈ సీజన్‌లో రూ. కోటి గెలుచుకున్న తొలి వ్యక్తిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే రూ.1 కోటి గెలుచుకున్న ఈ గృహిణి చదువుకున్నది కేవలం ఇంటర్ వరకే అయినా... ఈ షో లో విజయం సాధించడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఇక ఆమె పర్సనల్ విషయానికొస్తే... మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా ఈ ఘనత సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె తన సంతోషాన్ని ఈ విధంగా పంచుకున్నారు. కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళను కావాలని అనుకున్నానని, తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు. మొత్తానికి రికార్డు సాధించానని సంబరపడ్డారు.

ఈ కరోడ్ పతి షోలో పాల్గొనేందుకు తాను ఎలాంటి పుస్తకం గానీ, టీవీ ఛానెళ్లు గానీ చూడలేదని కవితా చావ్లా తెలిపారు. తన కుమారుడికి తాను ఏది బోధించినా ఆ పుస్తకాలనే తాను కూడా చదువుకునేదాన్నని స్పష్టం చేశారు. ఈ గెలుచుకున్న సొమ్ముతో ఏం చేస్తారని ప్రశ్నించగా.. ఆ డబ్బును తన కుమారుడి చదువు కోసం ఉపయోగిస్తానని, దానికే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. పై చదువుల కోసం అతడిని విదేశాలకు పంపుతానన్నారు. విదేశాల్లో చదువుకుని దేశానికి గర్వకారణంగా నిలవాలన్నది అతడి కల అన్న ఆమె... ఈ షో ద్వారా ప్రతి ఒక్కరూ కోటి రూపాయలు గెలుచుకోవాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అది కూడా తన కలేనని అన్నారు.