కశ్మీర్లో కొనసాగుతున్న నిరసనలు

 కశ్మీర్లో కొనసాగుతున్న నిరసనలు
  • కశ్మీర్ వదిలి వెళ్తున్న పండిట్లు
  • తమను బదిలీ చేయాలంటూ ఉద్యోగుల నిరసనలు

కశ్మీర్: ఉగ్రవాదుల ఘాతుకాలతో కశ్మీర్ లో నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. దాడులతో విసిగిపోయిన కశ్మీరీ పండిట్లు, ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నారు. చాలా మంది పండిట్లు కశ్మీర్ ను వదిలి వెళుతుండగా.. ఉద్యోగుల్లో చాలా మంది తమను బదిలీ చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదని.. తగినంత భద్రత కల్పిస్తామని.. త్వరలోనే పరిస్థితులు అదుపులోకి వస్తాయంటున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

కశ్మీరీ పండిట్ కుటుంబాలు 1990ల్లో వలస వెళ్లాయి. వారిని తిరిగి స్వస్థలాలకు రప్పించేందుకు ప్రధానమంత్రి పునరావాస ప్యాకేజీ కింద వేలాది మందికి ఎస్సీ కోటాలో ఉద్యోగాలిచ్చి కశ్మీర్ లోయలో నియమించింది కేంద్రం. వీరికి ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించింది. దీంతో చాలామంది తిరిగి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. గత కొన్నినెలలుగా వీరిని లక్ష్యంగా చేసుకుని మళ్లీ దాడులు జరుగుతున్నాయి. దీంతో కశ్మీర్ లోయలో విధులు నిర్వహిస్తున్న వేలాది మంది పండిట్స్, ఉద్యోగులు నిరసనలకు దిగుతున్నారు. తమను మరో ప్రాంతానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కశ్మీర్ వీడుతున్న ఉద్యోగులు
టెర్రరిస్టుల భయంతో ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కశ్మీర్ వీడి వెళ్లిపోయారు. కశ్మీర్ లో ఉద్యోగాలు చేస్తున్న హిందువులు తమకు రక్షణ కావాలంటూ నిరసనలకు దిగారు. తమను జమ్మూకు ట్రాన్స్ ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. లోయలో సెక్యూరిటీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకొకర్ని చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలతో సహా కశ్మీర్ లో ఉండలేమని.. తమను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు.
ఆందోళనలపై స్పందించిన కేజ్రివాల్
కశ్మీర్ పరిస్థితులపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్ స్పందించారు. జమ్మూకశ్మీర్ లో పండిట్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. గత 30 ఏళ్లలో రెండుసార్లు కశ్మీరీ పండిట్లు.. అక్కడ బతకలేక వలస వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ఈ రెండుసార్లు జమ్మూకశ్మీర్ లో బీజేపీ అధికారంలో ఉందన్నారు. కశ్మీరీ పండిట్లకు రక్షణ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలన్నారు కేజ్రీవాల్. 
కేజ్రివాల్ కు కౌంటరిచ్చిన  కేంద్ర మంత్రి బీఎల్ వర్మ 
ఆప్ పార్టీ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీకి కౌంటరిచ్చారు కేంద్రమంత్రి బీఎల్ వర్మ. కేజ్రీవాల్ కశ్మీర్ కంటే ముందు ఢిల్లీపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. మోడీ ప్రధాని అయిన తర్వాత జమ్మూకశ్మీర్ అభివృద్ధి చెందుతోందన్నారు. కొన్ని ఘటనలు జరిగటం వాస్తవమైనప్పటికీ శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రస్తుత పరిస్థితులను కశ్మీర్ ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని అన్నారు.. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. దీపం ఆరిపోయేటప్పుడు వెలుతురు ఎక్కువుంటుందన్నారు. చివరి శ్వాసలో ఉన్నవాళ్లే ఈ పరిస్థితులకు కారణమన్నారు. భద్రతా దళాలు త్వరలోనే పరిస్థితులను దారికి తెస్తాయన్నారు. కశ్మీర్ కు టూరిస్టుల సంఖ్య పెరిగిందని.. ఈ విషయాన్ని కశ్మీరీ ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్  మనోజ్ సిన్హా.