101 ఏళ్ల కేరళ వృద్ధ విద్యార్థిని కార్త్యాయని అమ్మ కన్నుమూత

101 ఏళ్ల కేరళ వృద్ధ విద్యార్థిని కార్త్యాయని అమ్మ కన్నుమూత

కేరళలో అత్యంత వృద్ధ విద్యార్థినిగా గుర్తింపు పొందిన కార్త్యాయని అమ్మ కన్నుమూశారు. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ ప్రతిష్ఠాత్మక వయోజన అక్షరాస్యత కార్యక్రమంలో ఆమె తన 96 ఏళ్ల వయసులో ఫస్ట్ ర్యాంకు పొందారు. గత ఏడాది నుంచి ఆమె పక్షపాతం వల్ల మంచానికే పరిమితమయ్యారు. చనిపోయే నాటికి ఆమె వయస్సు 101 ఏళ్లు.

కార్త్యాయని అమ్మ నాలుగో తరగతి తత్సమాన పరీక్ష అయిన 'అక్షరలక్షం' పరీక్షలో అత్యధిక మార్కులు సాధించారు. ఈ పరీక్ష రాసిన 43 వేల 330 మందిలో ఆమె అత్యంత వృద్ధురాలు. దీంతో ఆమెకు నారీ శక్తి అవార్డు కూడా వరించింది. ఈ అవార్డును కార్త్యాయని అమ్మ ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 2019లో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.

కార్త్యాయని అమ్మ మరణం పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర అక్షరాస్యత మిషన్ కింద అత్యంత వృద్ధురాలిగా చరిత్ర సృష్టించిన కార్త్యాయని అమ్మ మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. సవాళ్లు ఎదురైనా విద్యను అభ్యసించాలనే అచంచల సంకల్పాన్ని ప్రదర్శిస్తూ ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.