కర్నూలు: కార్తీక పౌర్ణమి వేడుకలు సోమవారం శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీశైలంలో వైభవంగా లక్ష దీపోత్సవం.. పుష్కరిణి హారతి నిర్వహించారు. విద్యుత్ దీపాల మెరుపులు.. లక్ష దీపాల వెలుగులతో దేవాలయం ధధగధగలాడింది. పుష్కరిణిలో జరిగిన లక్ష దీపోత్సవంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు. పుష్కరిణి హారతిలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఓ వైపు రంగు రంగుల విద్యుత్ దీపాల మెరుపులు.. మరో వైపు భక్తులు వెలిగించిన కార్తీక దీపాల వెలుగుల మధ్య శ్రీశైల మహా క్షేత్రం ధగధగా మెరుసింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ.. పూజలు నిర్వహించిన తర్వాత శాస్రోక్తంగా దశవిధ హారతులు, నీరాజనాలు సమర్పించారు ఆలయ పూజారులు. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
దశవిధ హారతులు విశిష్టతలను వివరించారు పండితులు
1 ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఈ ఓంకార హారతిని దర్శించడం వల్ల కష్టాలన్నీతొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.
2.నాగహారతి: ఈ నాగ హారతిని దర్శించడం వల్ల సర్ప దోషాలు తొలగి.. సంతానం కలుగుతుంది.
3.త్రిశూల హారతి: ఈ త్రిశూల హారతిని దర్శించడం వల్ల అపమృత్యువు అంటే అకాల మరణం తొలగిపోతుంది. గ్రహ దోషాలు నివారించబడతాయి.
4.నంది హారతి: ఈ నంది హారతిని దర్శించడం వల్ల భయం.. దుఖము ఉండదు. ఆనందం, ఉత్సాహం లభిస్తాయి.
5.సింహహారతి: ఈ సింహహారతిని దర్శించడం వలన శత్రు బాధలు తొలగుతాయి. మనో ధైర్యం కలుగుతుంది.
6.సూర్య హారతి: ఈ సూర్య హారతిని దర్శించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది.దీర్ఘాయుష్షు లభిస్తుంది.
7.చంద్రహారతి: ఈ చంద్రహారతిని దర్శించం వల్ల మనశ్శుద్ది కలుగుతుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
8.కుంభహారతి: ఈ కుంభ హారతిని దర్శించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి.
9.నక్షత్ర హారతి: ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది.
10.కర్పూర హారతి: ఈ కర్పూర హారతిని దర్శించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. యజ్ఘఫలంతోపాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

