శివోహం: తెలంగాణలో దేవాలయాలు రద్దీ..ఓ పక్క పుణ్య స్నానాలు.. మరో పక్క కార్తీక దీపారాధనలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్​ జిల్లాలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించారు.  కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.  తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ లోని దేవాలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గుట్టపైన శివాలయంలో ఈ రోజు సాయంత్రం ( నవంబర్​ 15) సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహిస్తామని యాదగిరి ఆలయం ఈవో భాస్కరరావు  తెలిపారు. 

కార్తీక పౌర్ణమి సందర్బంగా వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి.  ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు . ఈ రోజు సాయంత్రం జ్వాలా తోరణం కార్యక్రమం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.  నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు.  తరువాత నదీతీరంలో కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలారు.  

నాగర్ కర్నూలుజిల్లా  కొల్లాపూర్ మండలం సోమశిలలో కార్తీకపౌర్ణమి సందర్భంగా సప్తనది సంగమం కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో భక్తులు  ప్రత్యేక పూజలు చేశారు..అచ్చంపేట మండలం రంగాపురంని శ్రీ ఉమామహేశ్వర ఆలయ క్షేత్రంలో తెల్లవారుజామునుంచే కార్తీకదీపాలు వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పూర్ణిమ సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు , అభిషేకాలు జరిగాయి. 

ALSO READ : కార్తీక శోభ: యాదాద్రి దేవాలయం .. వరంగల్​ వేయిస్తంభాల గుడి.. భక్తులతో కిటకిట

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలు, వైష్ణవ దేవాలయాలు  భక్తుతో కిక్కిరిసి పోయాయి.  యాదగిరిగుట్ట, కొలనుపాక శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు చేశారు. పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాల్లో భక్తుల అభిషేకాలు చేసి.. కార్తీక దీపాలు వెలిగించారు. చెర్వుగట్టు, వాడపల్లి త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య  స్నానాలు.. నదీ తీరంలో కార్తీక దీపాలు వెలిగించి అగస్తేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు. సూర్యాపేట జిల్లా ప్రాచీన పిల్లలమర్రి శివాలయంలో విశేషంగా పూజలు జరిగాయి.