కర్నాటక నుంచి..మిల్లులకు నేరుగా సన్నాలు

గద్వాల, వెలుగు: కర్నాటక నుంచి డైరెక్ట్ గా సన్నవడ్లు మిల్లులకే వచ్చి చేరుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దులో కర్నాటక బార్డర్  ఉండడంతో అక్కడి నుంచి నేరుగా కేటిదొడ్డి, గట్టు, ధరూర్ మండలాల్లోని రైస్  మిల్లులకు సన్న వడ్లు వస్తున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు గుట్టుచప్పుడు కాకుండా మిల్లులకు వస్తున్నాయని అక్కడి రైతులు చెబుతున్నారు. రాష్ట్ర సర్కారు సన్నాలకు రూ.500 బోనస్  ఇవ్వడంతో వాటిని సొమ్ము చేసుకునేందుకు కొందరు మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, సివిల్  సప్లై ఆఫీసర్లు కుమ్మక్కై ఈ దందాకు తెర లేపారనే ఆరోపణలున్నాయి.

కర్నాటక నుంచి రైస్  మిల్లులకు వచ్చిన వడ్లను, గట్టు, ధరూరు, కేటిదొడ్డి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఆ తరువాత వారికి అనుకూలమైన రైతుల ఖాతాల్లో డబ్బులు వేయించి బోనస్  డబ్బులు కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఇలా వందల క్వింటాళ్ల వడ్లను మిల్లులకు తరలించి సొమ్ము చేసుకున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని సివిల్  సప్లై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లగా.. ఈ వ్యవహారంపై దృష్టి పెడతామని చెప్పారు.