గత 40 ఏండ్లల్లో ..ఇంతటి కరువు చూడలె : డీకే శివకుమార్

గత 40 ఏండ్లల్లో ..ఇంతటి కరువు చూడలె : డీకే శివకుమార్
  • తమిళనాడుకు కావేరీ జలాలను ఇవ్వబోం

బెంగళూరు : కర్నాటకలో ఇంత నీటి సంక్షోభాన్ని గత 40 ఏండ్లల్లో ఎన్నడూ చూడలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో  ప్రతిపక్షాలు(బీజేపీ,- జేడీఎస్) ఈ అంశంపై రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తమిళనాడుకు కావేరీ నదీ జలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయబోమని తేల్చిచెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

 రాష్ట్రంలో ఇలాంటి నీటి కరువును గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదు. వచ్చే రెండు నెలలు చాలా కీలకం. నీటి డిమాండ్ ను తీర్చేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నది. బెంగళూరు సిటీలో వాటర్ మాఫియాకు అడ్డుకట్ట వేయటంపై ఫోకస్ పెట్టాం. బెంగళూరు సిటీలో13,900 బోరు బావులుండగా.. వీటిలో 6,900 ఎండిపోయాయి.

ఈ పరిస్థితుల్లో ప్రజల అవసరాన్ని తీర్చేందుకు బీబీఎంపీ, బీడబ్ల్యూఎస్ఎస్బీ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాయి. కర్నాటకలో 240 తాలూకాల్లో 223ను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 196 తాలూకాల్లో తీవ్ర స్థాయి కరవు నెలకొంది. మే నాటికి బెంగళూరు చుట్టుపక్కలున్న 110 గ్రామాలకు కావేరి నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాం. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే తమిళనాడుకు నీరు విడుదల చేయడానికి మేం మూర్ఖులం కాదు" అని  డీకే శివకుమార్ అన్నారు. 

బోర్ల తవ్వకాలపై ఆంక్షలు

నీటి సంక్షోభం నేపథ్యంలో బోర్ బావుల తవ్వకాలపై బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(బీడబ్ల్యూఎస్ఎస్బీ ) ఆంక్షలు విధించింది. అనుమతి లేకుండా బోర్ తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. బోర్ల తవ్వకానికి అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.