మహిళా ఐఏఎస్ ల మధ్య గొడవ.. ఇద్దరిపై బదిలీ వేటు

మహిళా ఐఏఎస్ ల మధ్య గొడవ.. ఇద్దరిపై బదిలీ వేటు
  • రాజీనామా నిర్ణయం వెనక్కి.. కొత్తపోస్టులో చేరనున్న మైసూరు కమిషనర్ శిల్పానాగ్
  • బదిలీ రద్దు కోసం సీఎం యడ్యూరప్పను కలసిన మైసూరు జిల్లా కలెక్టర్ సింధూరి

బెంగళూరు: మైసూరు జిల్లాలో తరచూ గొడవపడుతూ బహిరంగంగా రచ్చకెక్కిన మున్సిపల్ కమిషనర్ శిల్పానాగ్, జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆదివారం సెలవు దినమైనప్పటికీ నిన్ననే రిలీవ్ చేసేసింది. జిల్లా కలెక్టర్ సింధూరి తన బదిలీ రద్దు కోసం ఏకంగా సీఎం యడ్యూరప్పను వెళ్లి కలువగా ఆయన చేతులెత్తేసినట్లు సమాచారం. ఇద్దరు యువ మహిళా ఐఏఎస్ అధికారిణులు విభేదాలతో బహిరంగంగా రచ్చకెక్కడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
కలెక్టర్ సింధూరి తనను టార్గెట్ చేసి అడుగడుగునా వేధిస్తున్నారని.. భరించలేకపోతున్నానంటూ మైసూరు మున్సిపల్ కమిషనర్ శిల్పానాగ్ ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా ప్రకటించడం సంచలనం రేపింది. అంతర్గతంగా ఉన్నతాధికారుల మధ్య ఉన్న విభేదాలను మున్సిపల్ కమిషనర్ అయిన శిల్పానాగ్ నేరుగా మీడియా సమావేశం పెట్టి బహిరంగ పరచడం కలకలం రేపింది. ఒకే జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు సర్వోన్నత అధికారులు ( ఐఏఎస్).. అందునా మహిళలు... ఇలా పబ్లిగ్గా గొడవపడడం  అందరి దృష్టిని ఆకర్షించింది. పనిచేసే చోట విభేదాలు సాధారణమే.. ఇంత అసాధారణ నిర్ణయాలేంటి..?  అసలు కర్నాటకలో ఏం జరుగుతోందంటూ అధికార వర్గాలే కాదు.. రాజకీయ వర్గాలు సైతం ఆరాలు తీయడం ప్రారంభించారు. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా ఐఎఎస్... ప్రస్తుత మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి మన తెలుగమ్మాయి కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో హాట్ టాపిక్ అయింది. 
రాజీనామాపై మెత్తపడ్డ శిల్పా నాగ్
గత ఫిబ్రవరిలో మైసూరు కమిషనర్‌గా నియమితులైన 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి, మైసూరు మున్సిపల్ కమిషనర్ శిల్పా నాగ్ గత గురువారం మీడియా సమావేశం పెట్టి తాను ఉద్యోగానికే రాజీనామా చేస్తున్నట్లు చేసిన ప్రకటన కలకలం రేపింది. ఐఏఎస్ సర్వోన్నత స్థాయి అధికారులు ఇలా బహిరంగంగా గొడవపడడం ఉన్నతాధికార వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. మైసూరులో స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు..  అందుకే నేను సివిల్‌ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.. అని శిల్పా నాగ్ చెప్పడం సంచలనం రేపింది. ససులో తనకంటే ఆరేళ్లు సీనియర్ అయిన జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరి (2009 బ్యాచ్ ఐఏఎస్) విధి నిర్వహణలో తనకు పదేపదే అడ్డుపడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని,  స్వేచ్ఛగా పని చేసుకోనివ్వడం లేదని, అడగడుగునా అడ్డు వస్తున్నారని, ఆమె పనితీరుతో విసిగిపోయి ఉద్యోగానికే రాజీనామా చేస్తున్నానని చెప్పిన మాటలు దేశ వ్యాప్తంగా ఐఏఎస్ అధికార వర్గాల దృష్టికి వెళ్లింది. 
ఇద్దిరిపై బదిలీ వేటు.. ఆదివారమే రిలీవ్
అసలే కరోనా కట్టడి కోసం కిందా మిందా పడుతున్న వేళ ఇద్దరు మహిళా ఐఏఎస్ ల మధ్య గొడవపై కర్నాటక ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. దిద్దుబాటు చర్యలకు ఉన్నతాధికారులు రంగంలో దిగారు. వెంటనే ఇద్దరినీ బదిలీ చేసి వారి స్థానాల్లో ఇతరులను నియమించారు. మైసూరు జిల్లా కలెక్టర్ గా డా.బి.గౌతమ్, మైసూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా లక్ష్మికాంత్ రెడ్డిని నియమించారు. ఇరువురిని వెంటనే రిలీవ్ చేసి కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. రోహిణి సింధూరి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గా బదిలీ చేయగా.. శిల్పా నాగ్ ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఈ గవర్నెన్స్ డైరెక్టర్ గా  నియమించారు. ఉన్నతాధికారుల జోక్యంతో శిల్పానాగ్ మెత్తపడి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కొత్త పోస్టులో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కలెక్టర్ రోహిణి సింధూరి మాత్రం జిల్లా వదిలి వెళ్లలేందుకు తొలుత నిరాకరిస్తూ సీఎం యడ్యూరప్పను వెళ్లి కలసినట్లు సమాచారం. ఆయన నుండి ఎలాంటి హామీ లభించిందో తెలియదు గాని ఆమె మెత్తబడినట్లు తెలుస్తోంది.