కర్ణాటకలో విద్యా సంస్థల ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్

కర్ణాటకలో విద్యా సంస్థల ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్
  • స్కూళ్లకు మాత్రం ఇప్పుడే కాదు...
  • ఈనెల 26 నుంచి కాలేజీలు, యూనివర్సిటీలకు  అనుమతి
  • 19 నుంచి సినిమా థియేటర్లకు అనుమతి
  • కండీషన్.. కోవిడ్ నిబంధనలతోపాటు కనీసం ఒక్క డోస్ వేయించుకుని ఉండాలి

బెంగళూరు: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో వడివడిగా అన్ లాక్ చర్యలకు శ్రీకారం చుడుతున్న కర్ణాటక సినిమా థియేటర్లతోపాటు విద్యా సంస్థలు ప్రారంభించేందుకు కూడా అనుమతులు ఇచ్చింది. ఈనెల 19 నుంచి థియేటర్లు 50 శాతం భర్తీతో నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. అలాగే కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు, సాంకేతిక కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ ఈనెల 26 నుంచి ప్రారంభించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్కూళ్లకు మాత్రం ఇప్పట్లో ప్రారంభించేందుకు అనుమతిలేదని స్పష్టం చేసింది. 
ఆదివారం ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మాట్లాడి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఉన్నతాధికారులతో చర్చలు జరిపి కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నందున కోవిడ్ నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ విద్యా సంస్థలు, సినిమా థియేటర్లకు అనుమతులివ్వాలని ఆదేశించారు. కర్ఫ్యూ ను రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగిస్తూ.. సినిమా థియేటర్లు 50 శాతం కెపాసిటీ భర్తీ చేసుకుని నిర్వహించేందుకు అనుమతిచ్చారు. అలాగే కాలేజీలు, యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్తలు కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించుకోవాలని.. అయితే విద్యార్థులతోపాటు సిబ్బంది అందరూ కనీసం ఒక డోన్ వ్యాక్సిన్ అయినా వేసుకుని ఉంటేనే అనుమతివ్వాలని స్పష్టం చేశారు. చిన్న పిల్లలతో ముడిపడిన వ్యవహారం కాబట్టి స్కూళ్లు ఇప్పట్లో ప్రారంభించే విషయంపై మళ్లీ చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప ప్రకటించారు.