బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు రాదని, బీజేపీ పూర్తి మెజారిటీని సాధిస్తుందని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. తన రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందని చెప్పారు. ‘‘పోస్ట్ పోల్ అలయన్స్‌పై కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల తర్వాత వాళ్లు పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్లకు పెద్దగా సీట్లు రావు” అని విమర్శించారు. గురువారం ఓ జాతీయ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. మెజారిటీ ఫిగర్ రాకపోతే బీజేపీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించగా.. ‘‘అసలు అలాంటి పరిస్థితే తలెత్తదు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారు. మేం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం” అని బొమ్మై చెప్పారు.
