- కొత్త కాలేజీల రాకతో మారనున్న క్యాంపస్ వాతావరణం
- పదేళ్లలో కొత్త కోర్సులు, కొత్త కాలేజీల ఏర్పాటును ప్రభుత్వం పట్టించుకోలే
కరీంనగర్, వెలుగు: దశాబ్దకాలంగా నిర్లక్ష్యానికి గురైన కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీసీ ప్రొఫెసర్ ఉమేశ్కుమార్రూపొందిస్తున్న ప్రతిపాదనలు విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాయి. ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వీసీ ఉమేశ్‌కుమార్ విజ్ఞప్తి మేరకు శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థి, అధ్యాపక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కాలేజీలు ఏర్పాటై విద్యార్థులు చేరితే శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ సందడిగా మారుతుంది.
కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించిన కోర్సులే..
కాంగ్రెస్ సర్కార్ హయాంలో 2008లో శాతవాహన యూనివర్సిటీని 13 కోర్సులతో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించారు. తర్వాత ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త కోర్సులను ప్రవేశపెట్టకపోగా.. బాటనీ, ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సుల నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చేశారు. క్యాంపస్ లో లేదా బయటి యూనివర్సిటీ పీజీ కాలేజీల్లో ఇంజినీరింగ్, బీఈడీ, ఎంఈడీ, లా కాలేజీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత శాతవాహన యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తే అందుకు విరుద్ధంగా జరిగింది.
బాధ్యతలు చేపట్టిన నెలన్నరలోనే మార్పు..
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 9 వర్సిటీలకు అక్టోబర్ 18న కొత్త వైస్ చాన్స్‌లర్లను నియమించింది. దీనిలో భాగంగా శాతవాహన వర్సిటీకి వీసీగా బాధ్యతలు స్వీకరించిన నెలన్నర రోజుల్లోనే ఉమేశ్‌కుమార్ పలు కీలకమైన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు పెట్టారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్, లా కాలేజీలు ఉన్నట్లే శాతవాహనలోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
Also Read : ఆర్టీసీకి మహాలక్ష్మి కటాక్షం
వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమోదముద్ర వేసి పెద్దపల్లి బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారు. అలాగే వీసీ బాధ్యతలు స్వీకరణ సందర్భంగా ప్రకటించినట్లుగా క్యాంపస్‌లోని లైబ్రరీ ఆడిటోరియంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరిగేలా శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ నెల 7న వీసీ ఉమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో జిల్లాలోని వివిధ కాలేజీలకు చెందిన 2,649 మంది రిజిష్టర్ చేసుకోగా, ఇంటర్వ్యూల అనంతరం 845మంది షార్ట్ లిస్టు చేశారు. వివిధ కంపెనీలు వీరి నుంచి 427 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు.
మరిన్ని కోర్సుల ప్రారంభిస్తాం..
మేం అడగగానే యూనివర్సిటీకి ఇంజినీరింగ్, లా కాలేజీ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు. వీటితోపాటు ఎంఫార్మసీ, ఎంఈడీ కోర్సులను కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు ఏటా రెండుసార్లు జాబ్ మేళా నిర్వహిస్తాం. రూ.8 కోట్లతో నిర్మించిన ఎగ్జామినేషన్ బ్రాంచ్ బిల్డింగ్ ను ఈ నెలలో ప్రారంభిస్తాం. - ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్, శాతావహన వర్సిటీ వీసీ