ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో జికా వైరస్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఇవాళ ( బుధవారం) ఒక్కరోజే కొత్తగా 14 కేసులు నమోదయ్యయాయి. పరిస్థితి విషమించడంతో జిల్లా కలెక్టర్.. చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో సమావేశం నిర్వహించారు. జికా సోకిన వారిలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నట్లు సమాచారం. గతంలో 11 కేసులుండగా.. లేటెస్టుగా నమోదైన కొత్త కేసులతో కలిపి కాన్పూర్ లో మొత్తం జికా కేసుల సంఖ్య 25కి పెరిగింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 టీమ్స్ తో శానిటేషన్, ఫాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వైరస్ కలిగిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం ద్వారా వ్యాధి వస్తుంది. అంతే కాక లైంగికంగా సంక్రమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గర్భిణులకు ఈవ్యాధి సోకినట్లయితే పుట్టబోయే పిల్లలకు వ్యాపించే అవకాశముంటుంది.
