మీరెలా నమ్మార్రా : టైం మెషీన్ తో వయస్సు తగ్గిస్తామంటూ.. రూ.35 కోట్లు కొట్టేసిన కేటుగాడు

ఈ మధ్యకాలంలో కొందరు అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇతరుల ఆశలని ఆసరాగా చేసుకుని ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. ఇటీవలే టైం మెషిన్ తో వయసు తగ్గిస్తామని ఇద్దరు దంపతులు వృద్ధుల నుంచి ఏకంగా రూ. 35 కోట్లు వసూలు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రంలో వెలుగు చూసింది, 

పూర్తీ వివరాల్లోకి వెళితే  స్థానిక రాష్ట్రంలోని కాన్పూర్ లో రాజీవ్ దూబే మరియు రష్మీ అనే ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు  కిద్వాయ్ నగర్‌లో రివైవల్ వరల్డ్ పేరుతో థెరపీ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ నుండి టైం మెషీన్‌ను తెచ్చామని దీని ద్వారా 60 ఏళ్ళ వయసున్నవారిని 25 ఏళ్ళ వ్యక్తులుగా మార్చేస్తామని ప్రచారం చేశారు. 

ఇది నమ్మిన పలువురు వృద్దులు ఏమాత్రం ఆలోచించకుండా రాజీవ్ దూబే దంపతులకు డబ్బులు చెల్లించారు. ఈ క్రమంలో ఇతరులకు రిఫర్ చేస్తే డిస్కౌంట్ ఇస్తామని చెప్పడంతో కొందరు ఇతరులకు కూడా రిఫర్ చేశారు. 

ALSO READ |వెరైటీ : ఈ హోటల్ కేవలం ఆడవాళ్లకు మాత్రమే.. మగాళ్లకు నో ఎంట్రీ..!

అయితే డబ్బు చెల్లించిన తర్వాత కొన్ని రోజులపాటూ హెల్త్ చెకప్స్ పేరుతో కొన్ని రోజులు కాలక్షేపం చెయ్యడంతో ఓ కస్టమర్ కి అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే దగ్గర్లోని పోలీసులని సంప్రదించి ఇజ్రాయెల్ టైమ్ మెషిన్ వ్యవహారం గురించి సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు విస్తుపోయే నిజాలు కనుగొన్నారు. 

ఈ  ఇజ్రాయెల్ టైమ్ మెషిన్ పేరుతో ఇప్పటివరకూ దాపుగా 40 మందికి పైగా వృద్దులు దాదాపుగా రూ.35 కోట్లు రాజీవ్ దూబే దంపతులకు చెల్లించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే పోలీసులకి సమాచారం అందిన విషయం ముందే తెలుసుకున్న రాజీవ్ దూబే మరియు అతడి భార్య పరారీలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.