కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయలేము: బాంబే హైకోర్టు

కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయలేము: బాంబే హైకోర్టు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌతన్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ఇవాళ(మంగళవారం) విచారించింది. ఖాతాను సస్పెండ్ చేయడం కుదరదని చెప్పింది. ట్విట్టర్ వేదికగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలను కంగన చేస్తోందని… తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తించిందని అలీ ఖాసిఫ్ ఖాన్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు..కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలని తాము ఆదేశించలేమని తెలిపింది. ట్విట్టర్ లో ఎవరికైనా ఖాతా ఉండొచ్చని, అందులో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలిపే హక్కు అందరికీ ఉంటుందని చెప్పింది. జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు, భావ ప్రకటన స్వేచ్ఛకు మధ్య చాలా తేడా ఉంటుందని తెలిపింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను జాతి వ్యతిరేక వ్యాఖ్యలని చెప్పలేమని వ్యాఖ్యానించింది. తదుపరి తీర్పును జనవరి 7 కు వాయిదా వేసింది బాంబే హైకోర్టు.