IND vs NZ 2024: న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్.. మూడో టెస్టుకూ విలియంసన్ దూరం

12 ఏళ్ళ తర్వాత సొంతగడ్డపై భారత జట్టుకు న్యూజిలాండ్ సిరీస్ ఓటమిని రుచి చూపించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుని భారత్ కు బిగ్ షాక్ ఇచ్చింది. మూడో టెస్టులోనూ గెలిచి భారత్ క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. ఈ  సమయంలో కివీస్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియంసన్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. గత నెలలో శ్రీలంకలో జరిగిన రెండో టెస్టులో గజ్జల్లో గాయం కారణంగా విలియంసన్ గాయపడ్డాడు. 

ఈ క్రమంలో భారత్ తో జరిగిన తొలి రెండు మ్యాచ్ లకు కేన్ దూరమయ్యాడు. విలియంసన్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని అతను వేగంగా కోలుకుంటున్నాడని.. బ్లాక్ క్యాప్స్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ చెప్పారు. ఇంగ్లండ్ సిరీస్‌కు విలియమ్సన్ ఫిట్‌గా ఉండాలని న్యూజిలాండ్ భావిస్తోంది. న్యూజిలాండ్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 28న ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కు ఈ కివీస్ బ్యాటర్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. 

విలియంసన్ లేకపోయినా న్యూజిలాండ్ భారత గడ్డపై అద్భుతంగా ఆడుతుంది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన విల్ యంగ్ చక్కగా రాణిస్తున్నాడు. ఇరు జట్ల మధ్య శుక్రవారం (నవంబర్ 1) నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్ కు షాక్ ఇచ్చి న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో టీమిండియాపై నెగ్గి 12 ఏళ్ళ తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో విజయం సాధించింది.