విలియమ్సన్ భారీ సెంచరీ

హామిల్టన్‌‌: సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (156) భారీ సెంచరీ కొట్టడంతో ఇంగ్లండ్‌‌తో మూడో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్‌‌ పట్టు బిగించింది. ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 136/3తో మూడో రోజు, సోమవారం ఆట కొనసాగించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌‌లో 453 స్కోరు వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్‌‌కు  658 రన్స్ భారీ టార్గెట్ ఇచ్చింది. విలియమ్సన్‌‌తో పాటు డారిల్ మిచెల్‌‌ (60), రచిన్ రవీంద్ర (44), శాంట్నర్ (49), టామ్‌‌ బ్లండెల్ (44 నాటౌట్‌‌) రాణించారు.

ఇంగ్లిష్ టీమ్ బౌలర్లలో బెతెల్‌‌ మూడు, బషీర్‌‌‌‌, స్టోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌కు వచ్చిన ఇంగ్లండ్‌‌ మూడో రోజు చివరకు 6 ఓవర్లలో 18/2 స్కోరుతో నిలిచింది. క్రాలీ (5), డకెట్ (4) నిరాశ పరచగా.. బెతెల్‌‌ (9 బ్యాటింగ్‌‌), జో రూట్ (0 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌ విజయానికి 640 రన్స్ అవసరం కాగా.. కివీస్‌‌కు 8 వికెట్లు కావాలి.