SL vs NZ 2024: కేన్ మామ సరికొత్త చరిత్ర: న్యూజిలాండ్ ఆల్‌టైం బెస్ట్ బ్యాటర్‌గా విలియంసన్

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. జాతీయ జట్టు తరపున 18199 పరుగులు చేసిన రాస్ టేలర్ రికార్డును అతను అధిగమించాడు. శ్రీలంకతో తాజాగా ముగిసిన తొలి టెస్టులో కేన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ సిరీస్ కు ముందు 72 పరుగులతో వెనక పడి ఉన్న ఈ కివీస్ మాజీ కెప్టెన్.. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేశాడు.  

విలియమ్సన్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో 359 మ్యాచ్‌లలో 48.18 సగటుతో 18,213 పరుగులు చేశాడు. 34 ఏళ్ల అతను 2010లో భారత్‌పై న్యూజిలాండ్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. 2010 లోనే భారత్ పై తొలి వన్డే..2011 లో జింబాబ్వేతో తన మొదటి టీ20 మ్యాచ్ ఆడాడు. 101 టెస్టుల్లో 8828 పరుగులు.. 165 వన్డేల్లో 6810 పరుగులు, 93 టీ20ల్లో 2575 పరుగులు చేశాడు. విలియమ్సన్ చరిత్ర సృష్టించిన ఈ టెస్టులో న్యూజిలాండ్ 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

ALSO READ |Duleep Trophy 2024: అదరగొట్టిన ఆంధ్రా కుర్రాడు.. దులీప్ ట్రోఫీ టాప్ స్కోరర్‌గా రికీ భుయ్

ఈ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 305 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 340 పరుగులు చేసి 35 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 309 పరుగులకు ఆలౌటైంది. 275 పరుగుల లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్ 211 పరుగులకు ఆలౌటైంది.