PAK vs ENG 2024: బాబర్ అజామ్ స్థానంలో కమ్రాన్ గులామ్.. ఎవరితను..? అంత పోటుగాడా..?

ఇంగ్లాండ్ తో జరగబోయే రెండో టెస్ట్ కు పాకిస్థాన్ సోమవారం (అక్టోబర్ 14) తమ ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. రెండేళ్లుగా ఘోరంగా విఫలమవుతున్న బాబర్ అజామ్ ను చివరి రెండు టెస్టుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. స్టార్ ప్లేయర్ ను బాబర్ ను తప్పించడంతో అతని స్థానంలో కమ్రాన్ గులామ్ ప్లేయింగ్ లో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం (అక్టోబర్ 15) జరగనున్న రెండో టెస్టులో ఈ 29 ఏళ్ళ బ్యాటర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. దీంతో ఈ ఆటగాడు ఎవరని నెటిజన్స్ వెతికే పనిలో ఉన్నారు. 

ఎవరీ కమ్రాన్ గులామ్..?

కమ్రాన్ గులామ్ కు పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ లో అపారమైన అనుభవం ఉంది. రెండేళ్లుగా అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. దశాబ్దం పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. 49.72 యావరేజ్ తో 4,525 ఫస్ట్-క్లాస్ పరుగులు.. 42.32 యావరేజ్ తో 3,344 లిస్ట్ ఏ  క్రికెట్ లో సత్తా చాటాడు. 2023లో న్యూజిలాండ్ పై తొలి సారి పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేశాడు. అయితే ఆడిన ఈ ఒక్క మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ అవకాశం రాలేదు. 

2023 నుండి గులామ్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 2023 నుంచి అతను 13 మ్యాచ్‌ల్లో ఏడు సెంచరీలతో 1,055 పరుగులు చేశాడు. యావరేజ్ 55 ఉంది. 2024 లో అతను 5 సెంచరీలు సాధించాడు. ఇటీవలే ఆగస్టులో బంగ్లాదేశ్ ఏ తో జరిగిన మ్యాచ్ లోనూ సెంచరీ కొట్టాడు. గులామ్‌ బ్యాటింగ్ తో పాటు పార్ట్ టైం బౌలర్ గా సత్తా చాటగలడు. ఇప్పటివరకు అతని ఫస్ట్‌క్లాస్ కెరీర్ లో 31 వికెట్లు ఉన్నాయి.

ALSO READ | Ranji Trophy 2024: కోహ్లీ సలహాలతోనే పుజారాను డకౌట్ చేశాను: తమిళనాడు పేసర్

ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే బౌలింగ్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. నోమన్ అలీ, సాజిద్ ఖాన్, జాహిద్ మెహమూద్ తుది జట్టులో స్థానం సంపాదించారు. ఈ ముగ్గురు షహీన్ అఫ్రిది, నజీమ్ షా, అబ్రార్ అహ్మద్ స్థానంలో వచ్చారు. పాకిస్థాన్ ఆడిన చివరి ఆరు టెస్టుల్లో ఓడిపోయింది. వీటిలో స్వదేశంలో వరుసగా 3 మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమి మూటకట్టుకుంది. 

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్:

సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, అమీర్ జమాల్, నోమన్ అలీ, సాజిద్ ఖాన్, జాహిద్ మెహమూద్