PAK vs ENG 2024: బాబర్ స్థానానికి ఎసరు.. సెంచరీతో పాక్‌ను నిలబెట్టిన కమ్రాన్ గులామ్

ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్ కమ్రాన్ గులామ్ సెంచరీతో అదరగొట్టాడు. బాబర్ స్థానంలో వచ్చి తీవ్ర ఒత్తిడిలో ఉన్న కమ్రాన్.. తన తొలి టెస్ట్ మ్యాచ్ లోనే సెంచరీతో దుమ్మురేపాడు. ఆడుతుంది తొలి టెస్ట్ అయినా ఎంతో పరిణితి చెందిన ఆటతో ఆకట్టుకున్నాడు. ఎక్కడా తడబడకుండా 192 బంతుల్లో 9 ఫోర్లు.. ఒక సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో బాబర్ నాలుగో స్థానానికి ఈ 29 ఏళ్ళ బ్యాటర్ ఎసరు పెట్టాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కమ్రాన్ గులామ్ సెంచరీతో తొలి రోజు పాకిస్థాన్ గౌరవ ప్రథమమైన స్కోర్ చేసింది. ప్రస్తుతం 80 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్రీజ్ లో గులామ్ (114), మహ్మద్ రిజ్వాన్ (26) ఉన్నారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఆరంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ అబ్దుల్ షఫీక్ (7) తో పాటు షాన్ మసూద్ (5) త్వరగానే పెవిలియన్ కు చేరారు. ఈ దశలో ఓపెనర్ సైమ్ అయూబ్ (77), గులామ్ మూడో వికెట్ కు 149 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. సౌద్ షకీల్ (4) విఫలమయ్యాడు.  

ALSO READ | IND vs NZ 2024: బెంగళూరులో మ్యాచ్..న్యూజిలాండ్ క్రికెటర్‌కు సొంతగడ్డ

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ కు పాకిస్థాన్ సోమవారం (అక్టోబర్ 14) తమ ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. రెండేళ్లుగా ఘోరంగా విఫలమవుతున్న బాబర్ అజామ్ ను చివరి రెండు టెస్టుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. స్టార్ ప్లేయర్ ను బాబర్ ను తప్పించడంతో అతని స్థానంలో కమ్రాన్ గులామ్ ప్లేయింగ్ లో చోటు దక్కించుకున్నాడు. దీంతో బాబర్ స్థానాన్ని అతడు నిలబెట్టుకోగలడా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇన్నింగ్స్ ఆసాంతం అద్భుతమైన బ్యాటింగ్ తో గులామ్ ఆకట్టుకున్నాడు.